బాసర ట్రిపుల్ ఐటీకి భారీగా తగ్గిన అప్లికేషన్లు

బాసర ట్రిపుల్ ఐటీకి భారీగా తగ్గిన అప్లికేషన్లు
  • గతేడాది 32,800.. ఈసారి 13,538 దరఖాస్తులే
  • గడువు పొడిగించినా పెద్దగా పెరగని అప్లికేషన్లు
  • వర్సిటీలో ఆందోళనలు, స్టూడెంట్ల ఆత్మహత్యలే కారణం?

హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీకి అప్లికేషన్లు భారీగా తగ్గిపోయాయి. గతేడాదితో పోలిస్తే స్టూడెంట్ల నుంచి దాదాపు 60 శాతం దాకా తగ్గాయి. 2022 -– 23లో 32,800 దరఖాస్తులు రాగా, ఈసారి 13,538 మాత్రమే వచ్చాయి. ఏటా 20 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చేవని, ఒక్కో సీటుకు 15 నుంచి 20 మంది పోటీపడేవారని అధికారులు చెబుతున్నారు. ఈ సారి మాత్రం ఒక్కోసీటుకు 8 నుంచి 9 మంది మాత్రమే పోటీపడుతున్నారని అంటున్నారు.

ఇటీవల వర్సిటీలో జరిగిన ఆందోళనలు, స్టూడెంట్ల ఆత్మహత్యలే దీనికి కారణమని తెలుస్తున్నది. బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2023 – 24 అకడమిక్ ఇయర్ ఆరేండ్ల బీటెక్ కోర్సులో అడ్మిషన్ల కోసం జూన్ 1న అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జనరల్ కేటగిరీలో మొత్తం 1,500 సీట్లతో పాటు మరో 105 గ్లోబల్ సీట్లు భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ముందుగా 19వ తేదీని డెడ్​లైన్​గా పేర్కొన్నారు. అయితే పెద్దగా అప్లికేషన్లు రాకపోవడంతో 22 వరకు దరఖాస్తు గడువు పెంచారు. జులై 3న సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే వర్సిటీ అధికారులు ఊహించిన దాని కంటే భారీగా దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. మొత్తం 1,605 సీట్లకు గాను 13,538 దరఖాస్తులే అందాయి.

టెన్త్ రిజల్ట్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడమే కారణం

ఏటా టెన్త్ రిజల్ట్స్ రాకముందే నోటిఫికేషన్ ఇచ్చేవాళ్లం. కానీ ఈసారి టెన్త్ రిజల్ట్స్ తర్వాత ఇచ్చాం. దీంతో తక్కువ జీపీఏ వచ్చిన వాళ్లు చాలామంది తమకు సీట్లు రావనే ఆలోచనతో అప్లై చేయలేదని అనుకుంటున్నాం. గతంలో 4 జీపీఏ వచ్చిన స్టూడెంట్లు కూడా దరఖాస్తు చేశారు. కానీ ఈసారి 6.7 జీపీఏ కటాఫ్. విద్యార్థులు ఆందోళనలు, స్టూడెంట్ల ఆత్మహత్యలు అప్లికేషన్లు తగ్గడానికి కారణం కాదని భావిస్తున్నా. జులై 3న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాం.
- ప్రొఫెసర్ వి.వెంకటరమణ, వీసీ, ఆర్జీయూకేటీ

వివాదాలు, ఆత్మహత్మలే కారణమా?

ఒకప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌లో బాసర ట్రిపుల్ ఐటీ అంటే మంచి పేరుండేది. కానీ గతేడాది జరిగిన స్టూడెంట్ల ఆందోళనలు, ఇటీవల ఇద్దరు స్టూడెంట్లు చనిపోవడం అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తున్నది. సరిగ్గా ఏడాది కిందట వర్సిటీలో ఫుడ్ సరిగా లేదని, ఫెసిలిటీస్ లేవని స్టూడెంట్లు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. దీనిపై చివరికి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. అప్పట్లో ఈ ఆందోళనలపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇప్పటికీ స్టూడెంట్లు పెట్టిన పలు కీలకమైన డిమాండ్లు నెరవేరలేదు. రెగ్యులర్ వైస్ చాన్స్​లర్, డైరెక్టర్ నియామకం, మెస్ టెండర్ల రద్దుపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు అడ్మిషన్లు తక్కువగా రావడానికి ఈ గొడవలు కారణం కాదని అధికారులు చెబుతున్నారు.