
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యం కోసం సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఎండోమెంట్ డెవలప్మెంట్ కుసంబంధించిన వివరాలను మంగళవారం మంత్రి మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది ప్రముఖ ఆలయాల కోసం మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసినట్టు చెప్పారు. సీజీఎఫ్ (సర్వశ్రేయోనిధి), ఇతర శాఖల నిధులు మొత్తం రూ.779.74 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం, బాసర జ్ఞానసరస్వతి దేవస్థానం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, కొడంగల్ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఆలంపూర్లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, చెర్వుగట్టు పార్వతిజడల రామలింగేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించామని చెప్పారు.
1,979 ఆలయాల్లో సీజీఎఫ్ ఎయిడ్ నిధులు రూ.502.17 కోట్లతో డెవలప్మెంట్ చేయనున్నామని పేర్కొన్నారు. 48 ఆలయాల్లో ఎస్డీఎఫ్ వర్క్స్ కు రూ.64.46 కోట్లు, ఆర్ అండ్ ఆర్ వర్క్స్ కింద 24 ఆలయాల్లో రూ.7.86 కోట్లు, రూ.111.25 కోట్లతో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి, రూ.50 కోట్లతో బాసర జ్ఞానసరస్వతీ, రూ.34 కోట్లతో భద్రాచలం సీతారామచంద్రస్వామి, రూ.30 కోట్లతో కొడంగల్ లోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాల పనులు చేపడుతున్నామని తెలిపారు. డిజిటలైజేషన్ వంటి ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.
దేవాలయ భూములు కాపాడుతాం
రాష్ట్రంలో ఎండోమెంటు భూములను కాపాడుతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ ఆఫీసులో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో కడ్తాల్ విలేజ్లో డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించి, మాట్లాడారు. ఏడాదిలో ఎండోమెంట్ ల్యాండ్స్ డిజిటలైజేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.
దేవాదాయ భూములను పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ఎండోమెంటు ల్యాండ్ డిజిటలైజేషన్ ప్రక్రియ షురూ చేసినట్టు పేర్కొన్నారు. దేవాదా య శాఖలో ‘ఈ- ఆఫీసు’తో ఫైల్స్ క్లియరెన్స్ మరింత వేగవంతమవుతుందని వివరించారు. ఈ కొత్త విధానంతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో పెండింగ్ ఫైల్స్ పారదర్శకంగా ముందుకెళ్తున్నాయని వెల్లడించారు.