రంగం ఒక ఆధ్యాత్మిక వేదిక... ఆలయానికి చేరుకున్న మాతంగి స్వర్ణలత

రంగం ఒక  ఆధ్యాత్మిక వేదిక... ఆలయానికి చేరుకున్న మాతంగి స్వర్ణలత

ఆషాఢమాసంలో  ఉజ్జయిని మహంకాళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగం కార్యక్రమాన్ని  జులై 14 న నిర్వహించేందుకు... భవిష్యవాణి చెప్పేందుకు మాతంగి స్వర్ణలత ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారు.  కర్నాటక లక్ష్మి ( ఏనుగు) ను ఆలయాధికారులు తీసుకొచ్చారు. 

   సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో  ఘటంతో ఎదుర్కోలు  వేడుకలు నిర్వహిస్తారు. మహంకాళి అమ్మవారు తన ఉత్సవాలకు రావలసిందిగా  తన తోటి  18 మంది అక్కచెల్లెళ్లను  ఆహ్వానించడమే ఈ ఘటోత్సవం. ఆ తరువాత న్యూబోయిగూడలోని దండు మారమ్మ ఆలయానికి వెళ్తారు. అది మహంకాళి  పుట్టినిల్లు. అక్కడి నుంచి గర్భాలయానికి చేరుకోవడంతో ఎదుర్కోలు ఘట్టం ముగుస్తుంది. ఆ తరువాత బోనాల ఉత్సవాలు....రంగంనిర్వహిస్తారు.  ఈ ఆధ్యాత్మిక వేదికను  స్వర్ణలత తమ్ముడు దినేష్‌ అలంకరిస్తాడు.

 పచ్చికుండను కొద్దిగా భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేస్తారు. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. జేగంటలు మోగుతాయి. పంబజోడు ఉత్సవం ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో  సరిగ్గా ఆ సమయంలోనే  ఆలయానికి చేరుకుంటుంది స్వర్ణలత. ‘ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. నేరుగా రంగం వద్దకు వస్తాను. ఆ తరువాత  ఏం జరుగుతుందో  నాకు తెలియదు... అంటున్న మాతంగి స్వర్ణలత ఆ తుదిఘట్టంలో   భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె వినిపించే భవిష్యవాణి ఈ ఏడాది  ఎలా ఉంటుందో  ఎదురు చూద్దాం.