మంచిర్యాల జిల్లాలో ‘మ్యాట్రిమోనీ’తో ఒంటరి మహిళలకు వల

మంచిర్యాల జిల్లాలో ‘మ్యాట్రిమోనీ’తో ఒంటరి మహిళలకు వల
  • పెండ్లి పేరుతో బంగారం దోచుకుని పరార్
  •     నిందితుడిని అరెస్టు చేసిన హాజీపూర్ పోలీసులు 

మంచిర్యాల, వెలుగు: మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని పెండ్లి చేసుకుంటానని నమ్మించి బంగారం, డబ్బులు దోచుకుంటున్న వ్యక్తిని మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్‌‌కు చెందిన కాళహస్తి శిరీష్‌‌కుమార్(38) కారు డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. షాదీ డాట్‌‌ కామ్ ద్వారా హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నెల 1న బైక్‌‌పై ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి కోసం బంగారం కొనిపిస్తానని చెప్పి మంచిర్యాలలోని ఒక షాపునకు తీసుకెళ్లాడు. 

సాయంత్రం తిరుగు ప్రయాణంలో గుడిపేట ఫిష్ మార్కెట్ దాటి మహారాజ్ ఫ్యామిలీ దాబా సమీపంలో బైక్ ఆపి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు బరువు చూస్తానని తీసుకున్నాడు. వెంటనే ఆమెను పక్కకు నెట్టి బైక్‌‌పై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఈ నెల 12న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కారు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌కు తరలించారు. శిరీష్‌‌కుమార్ గతంలో ప్రకాశం జిల్లాలో మూడు బైక్ దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అలాగే మ్యాట్రిమోనీ సైట్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళను పెండ్లి చేసుకుని రూ.3 లక్షలు తీసుకుని పరారైన కేసులోనూ కోర్టుకు హాజరవుతున్నట్టు వెల్లడించారు.