నిధుల కోసం మీ కాళ్ల మీద పడాలా.. కేంద్రం పై మమత ఫైర్

నిధుల కోసం మీ కాళ్ల మీద పడాలా.. కేంద్రం పై మమత ఫైర్

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం పై మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం.. మీ కాళ్ల మీద పడి అడుక్కోవాలా అంటూ మోడీ సర్కార్‭ను ప్రశ్నించారు. జీఎస్టీ కేటాయింపులతో పాటు.. వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడం పై మమతా బెనర్జీ మండిపడ్డారు. జర్‭గ్రామ్‭లో జరిగిన భగవాన్ బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

100 రోజుల ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేయడం తప్పనిసరి అని ఆమె అన్నారు. దీనిపై గత ఏడాది క్రితమే ఢిల్లీ వెళ్లి మోడీని అడిగానని చెప్పారు. ఇప్పటివరకు నిధులు రాలేదని.. అందుకోసం మీ కాళ్ల మీద పడి అడగాలా అని దీదీ ప్రశ్నించారు. మాకు రావాల్సిన నిధులు ఇవ్వండి.. లేదంటే జీఎస్టీనే రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఒకే పార్టీ పాలనలో దేశమంతా ఉందా? అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ నిధులు అయినా చెల్లించండి లేదా కుర్చీ నుంచి దిగిపోండి అన్నారు. బెంగాల్ ప్రజలకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వాల్సిందే అని మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.