Rajamouli-James Cameron: రాజమౌళి సెట్స్‌కు జేమ్స్ కామెరాన్?.. 'వారణాసి' మూవీపై హాలీవుడ్ లెజెండ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 Rajamouli-James Cameron: రాజమౌళి సెట్స్‌కు జేమ్స్ కామెరాన్?.. 'వారణాసి' మూవీపై హాలీవుడ్ లెజెండ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అద్బుతాలు సృష్టించే ఇద్దరు లెడండనీ దర్శకులు ఒకే వేదికపై కలిస్తే.. ఆ ఊహే అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది.  లేటెస్ట్ గా హాలీవుడ్ సంచలనం జేమ్స్ కామెరాన్, ఇండియన్ సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకధీరుడు ఎస్.ఎస్ . రాజమౌళి మధ్య అరుదైన సంభాషణ జరిగింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జేమ్స్ కామెరాన్  విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇండియాలో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు జేమ్స్ కామెరాన్. ఇందులో భాగంగా రాజమౌళితో జరిగిన 'మీటింగ్ ఆఫ్ ది మైండ్స్' వీడియో కాన్ఫరెన్స్‌లో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి.

రాజమౌళి ఫ్యాన్ బాయ్ మూమెంట్..

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజమౌళి మాట్లాడుతూ.. నేను అవతార్ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో ఒక చిన్న పిల్లవాడిలా మైమరిచిపోయాను. హైదరాబాద్ ఐమాక్స్‌లో ఈ సినిమా దాదాపు ఏడాది పాటు ఆడి ఒక రికార్డు సృష్టించింది అని రాజమౌళి తన జ్ఞాపకాలను పంచుకున్నారు.  దీనికి జేమ్స్ కామెరాన్ కూడా..  రాజమౌళి టేకింగ్‌ను మెచ్చుకుంటూ..  నీ సినిమాల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. నువ్వు ఆ మ్యాజిక్‌ను ఎలా క్రియేట్ చేస్తావో చూడటానికి నీ సెట్స్‌కు రావాలని ఉంది అని  తన మనసులో కోరికను బయటపెట్టారు.

 'వారణాసి' సెట్స్‌కు జేమ్స్ కామెరాన్?  

ఈ సంభాషణలో రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' గురించి కామెరాన్ అడిగి తెలుసుకున్నారు.  నువ్వు 'వారణాసి' షూటింగ్‌లో ఉన్నావు కదా? వీలైతే నేను సెట్స్‌కు వచ్చి నిన్ను కలవవచ్చా? అని జేమ్స్ కామెరాన్ అడిగారు. దీంతో రాజమౌళి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఖచ్చితంగా సార్.. మీరు రావడం మా యూనిట్‌కే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం అని బదులిచ్చారు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో పులులతో సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా పులులతో ఏదైనా సరదా సీక్వెన్స్ చేస్తుంటే నాకు చెప్పు, తప్పకుండా వస్తాను అని  జేమ్స్ కామెరాన్ చమత్కరిస్తూ అనడంతో.. ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ 'వారణాసి ' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి..  ఈ మూవీలో  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని ఆధునిక సైన్స్ ఫిక్షన్‌తో పాటు పురాణ గాథల మేళవింపు. త్రేతాయుగం, రామాయణం, హనుమంతుడు, శ్రీరాముడు, కాశీ నగరానికి ఉన్న ఆధ్యాత్మిక బంధం ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయి. 

జేమ్స్ కామెరాన్ 'అవతార్ 3' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు రాజమౌళి తన 'వారణాసి'తో ప్రపంచ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయిక ఇప్పుడు ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్‌కు వెళ్ళిందనడానికి నిదర్శనమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.