మెదక్​ బీఆర్ఎస్ ​టికెట్​ రేసులో ‘మైనంపల్లి’!

మెదక్​ బీఆర్ఎస్ ​టికెట్​ రేసులో ‘మైనంపల్లి’!
  •     ఏడుపాయలలో హన్మంతరావు వ్యాఖ్యలతో మారుతున్న రాజకీయం
  •       కొడుకును రంగంలోకి దింపే దిశగా కార్యాచరణ
  •      ముగ్గురు ఆశావహుల్లో టికెట్​ దక్కేదెవరికో..? 
  •      ఒకరికి కేసీఆర్, మరొకరికి కేటీఆర్, ఇంకొకరికి హరీశ్​రావు అండ!

మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో క్రమంగా పొలిటికల్​ హీట్​పెరుగుతోంది. మెదక్​ బీఆర్ఎస్​ టికెట్ రేసులో మరో కొత్త వ్యక్తి తెరపైకి రావడంతో స్థానిక రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు రానున్న ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి తన కొడుకును పోటీ చేయించే దిశగా కార్యాచరణ షురూ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం హన్మంతరావు కొడుకు రోహిత్​తో కలిసి ఏడుపాయల జాతరకు వచ్చారు. మెదక్ పట్టణంతో పాటు, పాపన్నపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కలిసి ఆయన మాట్లాడుతూ తన కొడుకు  మెదక్ నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. మెదక్ సెగ్మెంట్ ను జిల్లాలో మోడల్ గా తీర్చిదిద్దేందుకు రోహిత్ కృషి చేస్తారని, అతడికి తన పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పారు. దీంతో మెదక్​ బీఆర్​ఎస్​ టికెట్​రేసులో మైనంపల్లి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితోపాటు, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. 

నాడు తండ్రి... నేడు కొడుకు..

ప్రస్తుత మల్కాజి గిరి ఎమ్మెల్యే, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో జరిగిన రామాయంపేట బై ఎలక్షన్ లో ఆయన టీడీపీ క్యాండిడేట్​ గా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 జనరల్ ఎలక్షన్ లో మెదక్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోగా మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేసి ఓడిపోగా, అనంతరం ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు తన రాజకీయ వారసుడిగా కొడుకు డాక్టర్ రోహిత్ ను మెదక్ అసెంబ్లీ స్థానం నుంచే రాజకీయ రంగప్రవేశం చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం కొడుకుతో కలిసి ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టినట్లు  తెలుస్తోంది. 

సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి ... 

గతంలో హన్మంతరావు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు తన కొడుకును సైతం తన బాటలోనే ముందుకు నడిపించాలని ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోం ది. అందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే మైనంపల్లి గతంలో మెదక్ ఎమ్మెల్యేగా పని చేసినందున నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆయన కొడుకుకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ లీడర్లకు హన్మంతరావు స్వయంగా ఫోన్ చేసి రోహిత్​కు సపోర్ట్ చేయాలని కోరినట్టు తెలిసింది. 

ఎవరి క్యాండిడేట్​కు దక్కేనో? 

సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు అండదండలు ఉన్నాయని, అందువల్ల ఈసారి కూడా మళ్లీ ఆమెకే టికెట్​వస్తుందని ఆమె అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదే నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఈ సారి మెదక్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉండటంతో కేసీఆర్​ ఆశీస్సులు అతడికే ఉంటాయని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రంగ ప్రవేశం చేస్తున్న మైనంపల్లి రోహిత్ కు మంత్రి కేటీఆర్ అండ ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్​కు దగ్గరి మనిషిగా పేరుందని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొనే తన కొడుకును రంగంలోకి దించారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఒకవేళ పార్టీ హైకమాండ్​ మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ రోహిత్ కు ఇచ్చినట్లయితే పద్మాదేవేందర్ రెడ్డిని మెదక్ ఎంపీగా పోటీ చేయించవచ్చనే చర్చ జరుగుతోంది.