జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం ఇది. 2026 ఫిబ్రవరి 11తో కౌన్సిల్ గడువు ముగియనుంది. బీఆర్ఎస్ కార్పోరేటర్లు, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా సమావేశానికి హాజరయ్యారు. 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు సభ్యులు.
కౌన్సిల్ చివరి సమావేశం సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రస్తుత పాలకవర్గం పూర్తి పదవీకాలానికి ముగింపు దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధికి సరికొత్త దశ,దిశ నిర్దేశించాం. హైదరాబాద్ అభివృద్ధి పట్ల అందరం కలిసి పనిచేసిన ప్రతి క్షణం నాకు చిరస్మరణీయం. ఈ బాధ్యతను నాపై ఉంచిన ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి..నాతో కలిసి నడిచిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు ఈ 5 ఏండ్లలో నగరంలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైవర్లు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రాథమిక సదుపాయాల మరింత విస్తరించాం. థీమ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ ల ద్వారా పచ్చదనం పెంపునకు ప్రత్యేక కృషి చేశాం. పేద, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు, చిరుద్యోగులకు 5 రూపాయల బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. చివరి సమావేశం కావడంతో టీ బ్రేక్ లో కార్పొరేటర్లతో ఫోటో సెషన్ ఉంటుందని మేయర్ అన్నారు.
