
- ఫీజు పేచేసిన బీజేపీ కార్పొరేటర్
- అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
- ఎత్తిచూపేందుకు ఈ పని చేసిన..
- బల్దియా కౌన్సిల్ మీటింగ్లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు:
జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరి ఆస్తులనైనా ఇంకొకరు ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఇదే అధికారుల పనితీరును, నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఓ కార్పొరేటర్ ఏకంగా మల్కాజిగిరి సర్కిల్ ఆఫీసుని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తన పేరు మీద చేయించాడు. కార్పొరేటర్ ఆన్ లైన్ లో అప్లై చేశాడు. అప్లికేషన్ తో పాటు బీఆర్ఎస్గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోని కూడా అప్ లోడ్ చేశాడు. ఇది చూడకుండానే అధికారులు అప్రూవల్ ఇచ్చారు. అంతేకాదు.. అసెస్ మెంట్ నంబర్ తో పాటు ఇంటి (1–1/10) నంబర్ కూడా జారీ చేశారు. ఆ నంబర్ ఆధారంగా రూ.194 ప్రాపర్టీ ట్యాక్స్ ని కార్పొరేటర్ పే చేశాడు. ట్యాక్స్ అసెస్ మెంట్ కు సంబంధించి ఆ విభాగ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి ఇది ఉదాహరణ. రెండో రోజు మంగళవారం బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో ప్రాపర్టీ ట్యాక్స్ పై ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ అంశాలపై పలువురు కార్పొరేటర్లు ప్రశ్నలు లేవనెత్తారు.
రాత్రికి రాత్రే ఏర్పాటవుతున్న ఓయో రూమ్స్, పబ్ లు
సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఓయో రూమ్స్, పబ్ లు ఏర్పాటు చేస్తున్నారని, ఇవి కాలనీల్లో రెసిడెన్షియల్ పర్పస్ లోనే కొనసాగుతున్నాయని, వీటిపై బల్దియాకు ఆదాయం రావడం లేదని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, లింగోజీ గూడ కార్పొరేటర్ రాజశేఖర్ ప్రస్తావించారు. ఇండ్లలోనే ఓయో రూమ్స్ పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తేనే బల్దియా పనులు చేయగలుగుతామని, రెసిడెన్షియల్ పర్పస్ లో పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే కమర్షియల్ గా మార్చే వాటిలో ఓయోలు ముందు వరుసలో ఉన్నాయని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ డిమాండ్ చేశారు. విజిలెన్స్ తనిఖీలు చేసి చర్యలు తీసుకొని ఫైన్లు వేయాలని కోరారు.
– జూబ్లీహిల్స్, లింగోజీ గూడ, బోరబండ కార్పొరేటర్లు వెంకటేశ్, రాజశేఖర్, బాబా ఫసియోద్దీన్
ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా ఆదాయం రావట్లే
ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం బల్దియాకు రావడం లేదని మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సిటీలో ఓపెన్ ప్లాట్ కొన్నా కూడా ట్యాక్స్ వేస్తారని, నా డివిజన్ పరిధి కాటేదాన్ లో అనేక గోదాములు ఉన్నాయని, పెద్ద పరిశ్రమలు ఉన్నా కూడా ట్యాక్స్ లు రావడంలేదని పేర్కొన్నారు. 2 లక్షల చదరపు ఫీట్లలోని పరిశ్రమల నుంచి కేవలం రూ.11 లక్షల ట్యాక్స్ మాత్రమే వస్తుందని చెప్పారు. కాటేదాన్ లో ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ గా వచ్చేందుకు లక్షలు ఇస్తున్నారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. జేఎన్ఎన్ యు ఆర్ ఎం ఇండ్లు ఉన్నాయని, వాటికి నీళ్లు ఇస్తున్నామని, ఎందుకు అసెస్ మెంట్లు ఇవ్వడం లేదని, ఇవి జారీ చేస్తే ట్యాక్స్ వస్తుందన్నారు.
హాస్టళ్ల నుంచి ట్యాక్స్ వసూలు చేయండి
తమ డివిజన్ లో అత్యధికంగా హాస్టల్స్ ఉన్నాయని, అందులో చాలా వరకు రెసిడెన్షియల్ పర్పస్ లోనే కొనసాగుతున్నాయని, వీటిపై తనిఖీలు జరిపి కమర్షియల్ ట్యాక్స్ లు వసూల్ చేయాలని అమీర్ పేట్ కార్పొరేటర్ సరళ సూచించారు. – సరళ, అమీర్ పేట్ కార్పొరేటర్
ఇంటి నంబర్లు లేక ఓటరు కార్డులు రావట్లేదు
జీహెచ్ ఎంసీ పరిధిలో పేదలను గుర్తించి ఇండ్లు ఇచ్చారని, వారికి అసెస్ మెంట్లు కాలేదని, దీంతో ఇంటి నెంబర్లు లేక ఓటర్ కార్డులు కూడా జారీ కావడం లేదని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పేర్కొన్నారు.
– విజయారెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్
ఇల్లీగల్ అంటూ కోట్లలో అధికారుల వసూళ్లు
ఇల్లీగల్ నిర్మాణాలు అని అధికారులు కోట్లలో దండుకుంటున్నారని, అయినా నిర్మాణాలు ఆగడం లేదు. ఇలా కాకుండా ఏదో ఒక చట్టం తీసుకొచ్చి వాటి నుంచి పన్నులు వసూలు చేస్తే బల్దియాకి ఆదాయం వస్తుంది.
– జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కార్పొరేటర్
ట్యాక్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం
ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారానే అధికంగా లాభం బల్దియాకి వస్తుందని చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫీకర్ పేర్కొన్నారు.
– జుల్ఫీకర్ ,చార్మినార్ ఎమ్మెల్యే
కార్పొరేటర్లను కుక్కల్లా చూస్తున్నరు
“ మేము ఫోన్ చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేటర్లను కుక్కల్లా చూస్తున్నరు. మేయర్, కమిషనర్ స్పందిస్తారు.. కానీ జోనల్ అధికారులు స్పందించడం లేదు. మీరు తిరిగే కారు నుంచి అన్ని ప్రజల సొమ్ములు.. అంటూ స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ పై వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు.
– వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి