- గతేడు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా
- మెరుగైన ఫలితాల కోసం చర్యలు చేపడుతామంటున్న ఆఫీసర్లు
మహబూబాబాద్, వెలుగు: గత విద్యాసంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో మహబూబాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం జిల్లాలో రెగ్యూలర్ డీఈవో లేక, ముందస్తు ప్రణాళికలు అమలు చేయకపోవడంతో టెన్త్రిజల్ట్ లో వెనుకబడిపోయే పరిస్థితి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు, ఉపాధ్యాయులకు శిక్షణ, డ్యూటీల పేరుతో 15 రోజులకు పైగా పాఠాలు ముందుకు సాగలేదు. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం, ఉద్యోగ ఖాళీలు, సమన్వయలోపం కారణంగా పది వార్షిక పరీక్షల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నాడు ముందస్తు ప్రణాళిక అమలు...
నేడు జాడ కరువు2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు రాష్ట్రంలో 32వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లను మొదలుకొని హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది, ఆ తర్వాత సంవత్సరం కాస్త మెరుగువడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఉత్సాహంతో గతేడాది ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎస్ఈఆర్టీ రూపొందించిన ప్రత్యేక మెటీరియల్‌తోపాటు, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ రూపొందించిన మెటీరియల్‌తో ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు.
కేజీబీబీ, మోడల్ స్కూల్స్ తోపాటు, పలు పాఠశాలల్లో వెనకబడిన విద్యార్థులకు ఇతర జిల్లాల నుంచి సబ్జెక్టులో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో ప్రత్యేక క్లాసులు నిర్వహించారు. నాటి డీఈవో రవీందర్ రెడ్డి కృషితో 99.29 ఉత్తీర్ణతతో మానుకోట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బాసర ట్రిపుల్ ఐటీలో జిల్లాకు చెందిన 175 మంది విద్యార్థులు సీటు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, జిల్లా అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు.
సమీపిస్తున్న వార్షిక పరీక్షలు..
గతంలో పది వార్షిక పరీక్షలకు 100 రోజుల ముందుగానే విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేశారు. డిసెంబర్ మాసం వరకే 10వ తరగతి సిలబస్‌ను పూర్తి చేశారు. తరచూ స్లిప్ టెస్టులు నిర్వహించారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు నిర్వహించారు. దాతల సహకారంతో అల్పాహారం అందించారు. మార్చి 14 నుంచి 10వ తనగతి వార్షిక పరీక్షల నిర్వహణకు టైమ్ టేబుల్ విడుదలయ్యింది. ఇప్పటి వరకు సరైన ప్రణాళిక అమలు లేకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడనున్నది.
మెరుగైన ఫలితాల కోసం చర్యలు చేపడుతాం..
ప్రభుత్వ పాఠశాలల్లో పది విద్యార్థులకు స్పెషల్క్లాస్లను నిర్వహించాలని ఆదేశాలను జారీ చేశాం. గతంలో ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చి మాసంలో స్నాక్స్ అందించింది. ప్రస్తుతం దాతల సహకారంతో ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. విద్యార్థులకు స్పెషల్ మెటీరియల్ అందించడానికి కృషి చేస్తాం. హైస్కూల్ హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశాం. పంచాయతీ రాజ్ ఎన్నికలు, ఇయర్ ఎండింగ్ కారణంగా అకాడమిక్‌కు కొంత ఇబ్బంది కలగిన మాటా వాస్తవమే. పది ఫలితాల మెరుగు కోసం చర్యలను వేగవంతం చేస్తాం. - రాజేశ్వర్, ఇన్చార్జి డీఈవో, మహబూబాబాద్ జిల్లా
మానుకోట జిల్లాలో పది ఫలితాల వివరాలు
అకాడ మిక్ ఇయర్ హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో స్థానం
2023-24 8178 7758 94.62 12
2024-25 8184 8138 99.29 01
