హైదరాబాద్ను గార్బేజ్ ఫ్రీ సిటీగా మారుస్తం : గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ను గార్బేజ్ ఫ్రీ సిటీగా మారుస్తం : గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గార్బేజ్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్(జీవీపీ) తొలగింపులో కీలకపాత్ర పోషించిన శానిటేషన్ కార్మికులు, అధికారులను శనివారం బల్దియా హెడ్డాఫీసులో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. శానిటేషన్ కార్మికుల కృషితోనే సిటీకి జాతీయస్థాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు.

బల్దియా పరిధిలోని 30 సర్కిళ్లలో 492 జీవీపీలను తీసివేశామన్నారు. అవార్డులు ఇచ్చి కార్మికులను ప్రోత్సహిస్తున్నట్లే, ఆర్పీలకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించాలని కమిషనర్ కు సూచించారు. సిటీ పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, ఇందుకు శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని కమిషనర్ రోనాల్డ్ రాస్  పేర్కొన్నారు.  సిటీలో 3,400 జీవీపీలను గుర్తించామని, వాటి వద్ద అపరిశుభ్రత పెరిగిపోవడంతో ఎత్తివేత ప్రక్రియను చేపట్టామని తెలిపారు.

రోడ్లపై చెత్త కనపడకుండా శానిటేషన్ నిర్వహణ కొనసాగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యం, అన్ని విభాగాల సమన్వయ సహకారంతోనే వంద శాతం జీవీపీ ఎత్తివేత సాధ్యమవుతుందన్నారు. అనంతరం జీవీపీలను తొలగింపులో కృషి చేసిన 298 మంది శానిటేషన్ కార్మికులు, సిబ్బందిని మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, కమిషనర్ శాలువా, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో యూసీడీ హెల్త్ అడిషనల్ కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి,  రవి కిరణ్, జోనల్ కమిషనర్లు అభిలాష అభినవ్, వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు, సఫాయి కార్మికులు, ఎస్ ఎఫ్ఏలు పాల్గొన్నారు.

బల్దియాను సందర్శించిన ఫ్రాన్స్ ఆఫీసర్ల టీమ్  

ఫ్రాన్స్  అధికారుల బృందం బల్దియాను సందర్శించింది. వారికి స్థానిక సంస్థల్లో బెస్ట్ ప్రాక్టీస్ లో భాగంగా అమలయ్యే పథకాలపై కమిషనర్ రోనాల్డ్ రాస్ కు వివరించారు. గ్రేటర్ లో చెరువులు అభివృద్ధి తో పాటుగా సుందరీకరణపై వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్  ప్రోగ్రామ్ కూడా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని ఫ్రాన్స్ ప్రతినిధులను కోరారు. గతంలో ఆ దేశ సహకారంతో సిటీలో పలు ప్రోగ్రామ్స్ చేపట్టినట్లు వారు వివరించారు.

బార్డెక్స్ మెట్రోపాలిటితో రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అగ్రిమెంట్ చేసుకున్నట్లు గుర్తుచేశారు. 2021–-22 సాకి వాటర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అర్బన్ ట్రయల్స్ ద్వారా వాటర్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ ను చేపట్టినట్లు తెలిపారు. అర్బన్ మేనేజ్ మెంట్ కింద ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఫ్రాన్స్ దేశ అధికారులు వివరించారు.

డీఆర్ఎఫ్  టేబుల్ బుక్ విడుదల  

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) టేబుల్ బుక్ ని మేయర్ గద్వాల్ విజయ్ లక్ష్మి విడుదల చేశారు.  డిజాస్టర్ టీమ్ చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు దోహద పడుతాయని పేర్కొన్నారు. వానాకాలంలో వరదల సమయం, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, ఈదురు గాలులకు చెట్లు విరిగినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు ఇతర ప్రమాదాల సమయంలో డీఆర్ ఎఫ్ సేవలు అందించిందన్నారు. దేశంలో  ఏ సిటీలో లేనివిధంగా డీఆర్ఎఫ్ ను బల్దియా ఏర్పాటు చేసిందన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని పలు నగరాల్లోనూ ఏర్పాటయ్యాయన్నారు.  ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి,  ఫైర్ అధికారులు ఉన్నారు.