కోవిడ్ డ్యూటీలో ఎంబీబీఎస్ విద్యార్థులు.. రోజుకు రూ.100 ఇన్సెంటివ్

కోవిడ్ డ్యూటీలో ఎంబీబీఎస్ విద్యార్థులు.. రోజుకు రూ.100 ఇన్సెంటివ్

దేశంలో కరోనాతీవ్రత అధికమైంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికితోడు దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను కోవిడ్ డ్యూటీలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకుగానూ విద్యార్థులకు ఇన్సెంటివ్ కింద నెలకు రూ. 3000 చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటికే కోవిడ్ ఆస్పత్రులలో పనిచేస్తున్న వైద్యులు, కాంట్రాక్ట్ వైద్యులు, జూనియర్ మరియు సీనియర్ రెసిడెంట్ వైద్యులకు కూడా ఈ ఇన్సెంటివ్ లభిస్తుందని సీఎం జై రామ్ ఠాకూర్ ప్రకటించారు. కాగా.. నర్సింగ్ విద్యార్థులు, జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ మూడవ సంవత్సరం విద్యార్థులు మరియు కాంట్రాక్టు ల్యాబ్ సిబ్బందికి నెలకు 1,500 రూపాయలు ఇన్సెంటివ్‌ ఇస్తామని ఆయన తెలిపారు.

కాంగ్రా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం.. జిల్లా అధికారులతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో సీఎం జై రాం ఠాకూర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అనంతరం జిల్లాలోని రాధస్వామి సత్సంగ్ వ్యాస్‌ కోవిడ్ సెంటర్‌ను సందర్శించిన సీఎం.. వచ్చే 10 రోజుల్లో ఇక్కడ అదనంగా 250 బెడ్లను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. ఆ సంఖ్య క్రమంగా 1,000 పడకలకు పెంచాలని ఆయన సూచించారు.