ఎంబీసీ కులాల్లో చైతన్యం

ఎంబీసీ కులాల్లో చైతన్యం

భారతదేశానికి సాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా సాతంత్ర్య ఫలాలు మాత్రం కొన్ని వర్గాలకే పరిమితం కావడం విచారకరం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గొప్పలు చెప్పుకుంటున్న మన దేశంలో అధికారంలో దీర్ఘకాలం కొన్ని వర్గాలే రాజ్యమేలడం పరిపూర్ణ ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అని ఆలోచించి నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దేశ పునర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఉత్పత్తి కులాలు.. నేటికీ ప్రధాన స్రవంతిలోకి రాకపోవడం దేనికి సూచిక? ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో కేవలం ధన, జన ఆధిక్య కులాలు మాత్రమే ప్రధాన భూమిక పోషించడంతో ధన, జన ప్రాబల్యం లేని కులాల జీవితాలు పూర్తిగా మసకబారాయి. 

సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ధన, జన ప్రాబల్యం లేని కులాల ప్రాతినిథ్యం లేకపోవడంలో ఆయా కులాలు తమ పూర్తి అస్థిత్వాన్ని కోల్పోయే దశకు చేరుకున్నాయి. సమస్త రంగాల్లో వీరికి దక్కాల్సిన న్యాయమైన వాటా వీరికి దక్కకపోవడంతో దేశంలోని ధన, జన ప్రాబల్యం లేని కులాలకు అన్నింటా అన్యాయమే జరుగుతోంది. 7 దశాబ్దాల పైబడిన స్వాతంత్య్ర దేశంలో ఇప్పటికీ 95 శాతం కులాలు చట్టసభల్లో అడుగు పెట్టకపోవడం ఆయా కులాలు అనుభవిస్తున్న రాజకీయ అంటరానితనాన్ని బుద్ధిజీవులుగా మనం అర్థం చేసుకోవాల్సిన చారిత్రక సందర్భం ఇది. సమాజంలోని అన్ని వర్గాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర ఫలాలను, చట్టసభలను కొన్ని వర్గాలే పరిమితం చేసుకుని తమ చుట్టరికాలతో చట్ట సభలను నింపడాన్ని ఎండగట్టాల్సిన అవసరాన్ని ముందుకు తీసుకెళ్లాం. ధన, జన ఆధిక్యం లేని మైనర్టీ కులాలను ఐక్యం చేస్తూ చట్ట సభల్లో మనకు ప్రాతినిధ్యం లభించే వరకూ పోరాడుదాం. పీడితుల పిడికిళ్లతో ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. లక్ష్య సాధనవైపు పురోగమిద్దాం.

మేలుకుంటున్న కులాలు

దేశంలో ఇప్పటివరకు జరిగిన ఉమ్మడి బీసీ ఉద్యమ ఫలితాలను కేవలం కొన్ని కులాలు మాత్రమే ఏకపక్షంగా అనుభవిస్తూ ఎంబీసీ కులాలను తీవ్ర వివక్షతకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి బీసీ ఉద్యమంలో నేర్చుకున్న గుణపాఠం నుంచి నూతన విశాల ఎంబీసీ ఉద్యమ నిర్మాణ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. గత అనుభవాల దృష్ట్యా బీసీలను మూడు విభాగాలుగా విభజించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. బీసీ, ఎంబీసీ, డీఎన్ టీలుగా విభజిస్తే గానీ ఈ వర్గాలకు న్యాయం జరగదు. దేశంలోని వెనుకబడిన తరగతుల స్థితిగతులపై అధ్యయనానికి వేసిన1953 నాటి కాకా కాలేల్కర్ కమిషన్, ఆ తరువాత వేసిన మండల కమిషన్లు తమ నివేదికలో చాలా స్పష్టంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. బీసీలను, ఎంబీసీలను ఒకే గాటికింద కట్టలేమని పేర్కొన్నాయి. 

ఆయా కమిషన్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తమిళనాడు, పాండిచ్ఛేరి ప్రభుత్వాలు బీసీలను మూడు వర్గాలుగా ఇప్పటికే విభజించాయి. కొంతమేర ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎంబీసీల కోసం ప్రత్యేక పథకాలు రచించాయి. తెలంగాణ రాష్ట్రంలో డీఎన్ టీలుగా గుర్తించాల్సిన సంచార జాతులను ఎంబీసీల జాబితాలో చేర్చి వారికి కొంతమేర అన్యాయం చేశారు. మెజార్టీ ఎంబీసీ కులాలను ఎంబీసీలుగా అధికారిక గుర్తింపు ఇవ్వకుండా బీసీల్లోనే కొనసాగిస్తూ ఆయా కులాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఇప్పటికే బీసీల వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు తక్షణమే జస్టిస్ రోహిణీ కమిషన్ బీసీ, ఎంబీసీ, డీఎన్ టీలుగా విభజించాలని డిమాండ్ చేస్తున్నాం. సమగ్ర సామాజిక న్యాయం వైపుగా పోరాటాలను పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– దొమ్మాట వెంకటేశ్, సోషల్​ ఎనలిస్ట్​