- టాప్–7 కంపెనీల మార్కెట్ క్యాప్ జూమ్
- రూ.1.23 లక్షల కోట్లు జంప్
- మొదటి స్థానంలో రిలయన్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభాల్లో ముగియడంతో టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.23 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక లాభాన్ని గడించింది. బీఎస్‍ఈ సెన్సెక్స్ 720 పాయింట్లు పెరిగి 0.84 శాతం లాభపడింది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.45,266 కోట్లు పెరిగి రూ.21.54 లక్షల కోట్లకు చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ రూ.30,414 కోట్లు, లార్సెన్ అండ్ టూబ్రో విలువ రూ.16,204 కోట్లు పెరిగాయి. హిందుస్థాన్ యూనీలీవర్, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ కూడా లాభపడ్డాయి. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.10,745 కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ కూడా నష్టపోయాయి. ప్రస్తుతం దేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి.
ఎఫ్ఐఐలు పీఛే ముఢ్..రూ.7,608 కోట్లు వాపస్
విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‍పీఐలు) 2026 ప్రారంభంలోనూ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఈ నెల మొదటి రెండు రోజుల్లోనే భారత ఈక్విటీల నుంచి రూ.7,608 కోట్లు ఉపసంహరించుకున్నారు. గత ఏడాదిలో రూ.1.66 లక్షల కోట్ల విలువైన భారీ అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్ ఆందోళనల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. దీని ప్రభావంతో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఐదు శాతం పడిపోయింది. మనదేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నందున రానున్న నెలల్లో పెట్టుబడులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని జియోజిత్ ఇన్వెస్ట్ మెంట్ నిపుణుడు వీకే విజయకుమార్ తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం, కార్పొరేట్ లాభాలు పెరగడం వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని ఏంజెల్ వన్ ప్రతినిధి వకార్జావేద్ ఖాన్ అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో ఎనిమిది సార్లు జనవరి నెలలో ఎఫ్‍పీఐలు అమ్మకాలకే మొగ్గు చూపారు.
