హైదరాబాద్, వెలుగు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్-డిస్ట్రిక్ట్ టీ20 టోర్నమెంట్ సెకండ్ ఫేజ్‌లో మెదక్, మహబూబ్‌నగర్ జిల్లా జట్లు శుభారంభం చేశాయి. తొలి మ్యాచ్‌లో మెదక్ 50 పరుగుల తేడాతో వరంగల్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో 191 రన్స్‌కు ఆలౌటైంది.
విక్రమ్ పటేల్ (45), అఖిల్ రాథోడ్ (43), శ్రీధర్ (38) రాణించారు. చేజింగ్‌లో వరంగల్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. ఎన్.రాహుల్ (27) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. మెదక్ బౌలర్ విక్రమ్ పటేల్ 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 43 పరుగుల తేడాతో కరీంనగర్‌పై విజయం సాధించింది. అబ్దుల్ రఫే బిన్ అబ్దుల్లా (90 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో మహబూబ్‌నగర్ తొలుత 20 ఓవర్లలో 182/6 స్కోరు చేసింది. కరీంనగర్ బౌలర్ షౌమిక్ కపూర్ 4 వికెట్లు తీశాడు. చేజింగ్‌లో కరీంనగర్ 20 ఓవర్లలో 139/8 పరుగులకే పరిమితమైంది. విజ్ఞేశ్ (36) టాప్ స్కోరర్. మహబూబ్ నగర్ బౌలర్లు టి.హరీశ్ (3/11), రాకేష్ నాయక్ (3/31) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తమ జట్టును గెలిపించారు. అబ్దుల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
