సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్
  • ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన కలెక్టర్​ రాహుల్ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​కలెక్టరేట్​లో పని చేసే ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే  కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్​ రాహుల్ రాజ్​ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్​లోని ఆయా శాఖల ఆఫీసుల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమయపాలన పాటించని అధికారులు, సమాచారం ఇవ్వకుండా సెలవులపై వెళ్లిన ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని డీఆర్​వో భుజంగరావును ఆదేశించారు. ఆయన వెంట కలెక్టరేట్​ ఏవో యూనస్, అకౌంటెంట్ పరమేశ్, సిబ్బంది ఉన్నారు.

నేడు అధికారులకు సెలవు రద్దు

వర్షాలు, వరదల వల్ల జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగినందున ఆదివారం అన్ని శాఖలకు సెలవు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు. ఆయా శాఖల సిబ్బంది వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. సోమవారం ప్రజావాణి దరఖాస్తులను హెల్ప్​డెస్క్​ ద్వారా స్వీకరిస్తామని చెప్పారు.  

మంజీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉమ్మడి మెదక్​ జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ రాహుల్ రాజ్​సూచించారు. మహారాష్ట్ర లోని లాతూర్, కర్నాటకలోని సాయిగామ్​ ప్రాంతాల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు సింగూరు ప్రాజెక్టుకు చేరుతుందన్నారు. ఆ నీటిని మంజీరా నదిలోకి విడుదల చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఎవరూ ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. పశువుల కాపర్లు, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దన్నారు. 

గణేశ్​ నిమజ్జనంలో సమన్వయం పాటించాలి

ప్రస్తుతం జిల్లాలో చెరువులు నిండు కుండలా ఉన్నాయని  దీనిని దృష్టిలో పెట్టుకొని గణేశ్​ నిమజ్జన సమయంలో భక్తులు సమన్వయం పాటించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్, ఎస్పీ శ్రీనివాస్​రావు సూచించారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. 

మండలంలోని కోంటూరు చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారు మాట్లాడుతూ..నిమజ్జన ప్రదేశాల్లో ఫెన్సింగ్​, లైటింగ్, క్రేన్లు  ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, తహసీల్దార్​లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.