సిద్దిపేటకు త్వరలోనే ఉప ఎన్నిక : నీలం మధు

సిద్దిపేటకు త్వరలోనే ఉప ఎన్నిక : నీలం మధు
  •     మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం 
  •     మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు 

జగదేవపూర్,మర్కూక్ వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్15 లోపు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తారని, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని, ఆగస్ట్​తర్వాత సిద్దిపేటకు ఉప ఎన్నిక రానుందని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి మాట్లాడారు.

మతం, ప్రాంతీయ వాదంతో ఓట్లు అడిగే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అంటేనే రామ్, రహీం, రాబర్ట్ అన్నారు. మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ పాలనలో దళితులకు భూములు, డబుల్ బెడ్ రూములు ఇవ్వలేదన్నారు. వైఎస్​రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూములతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే  ప్రజలకు ఇచ్చిన 5 గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు.  కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అమర రాము, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కనకయ్య గౌడ్, తిరుమల్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, కొంపల్లి కరుణాకర్, రాగుల రాజు, బరిగే నర్సింలు, జితేందర్ రెడ్డి ఉన్నారు.