
మెదక్, వెలుగు: ఈ వానాకాలం సీజన్ లో మెదక్ జిల్లాలో జూన్, జులై నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఆగస్టులో మాత్రం కరువు తీరా వాన కురిసింది. గడిచిన మూడు నెలల్లో జిల్లాలో సరాసరి 51.8 సెంటిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా అంతకు మించి 98.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. 8 మండలాల్లో సాధారణం కంటే 100 శాతం ఎక్కువ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల కొంత మేర నష్టం జరిగినప్పటికీ చెరువులు, కుంటలు అన్నీ పూర్తిగా నిండడంతో వానకాలం సీజన్ లో వేసిన పంటలకు డోకా లేకుండా పోయింది.
యాసంగి సీజన్ లో సైతం పూర్తి స్థాయిలో పంటలు పండించే అవకాశం ఏర్పడింది. జూన్ నెలారంభం నుంచి ఆగస్ట్ 31 వరకు జిల్లాలో సరాసరి 51.8 సెంటిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 98.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 90 శాతం ఎక్కువ. జిల్లాల్లో మొత్తం 21 మండలాలు ఉండగా 19 మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయింది. నిజాంపేట, చిన్నశంకరంపేట మండలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసింది. పెద్దశంకరం పేట, అల్లాదుర్గం, టేక్మాల్, రామాయంపేట, వెల్దుర్తి, తూప్రాన్, కొల్చారం, చేగుంట మండలాల్లో సాధారణం కంటే 100 శాతం ఎక్కువ వర్షం కురిసింది.
నిండుకుండల్లా సాగునీటి వనరులు
కుండపోత వర్షాలు పడడంతో జిల్లాలోని సాగునీటి వనరులన్నీ నిండుకుండల్లా మారాయి. హల్దీ
వాగు, పసుపులేరు వాగు, పుష్పాల వాగు, గుండు వాగు జలకలను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు 2,163 ఉండగా అన్నీ పూర్తిగా నిండాయి. కొల్చారం మండల పరిధిలోని ఘనపూర్ ఆనకట్ట దాదాపు 20 రోజులుగా పొంగి పొర్లుతోంది.
మంజీరా నదిమీద మెదక్ మండలం ర్యాల మడుగు, హవేలీ ఘనపూర్ మండలం కూచంపల్లి వద్ద, హల్దీ వాగు మీద తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి, కొల్చారం మండలాల పరిధిలో నిర్మించిన చెక్ డ్యామ్ లు పూర్తిగా నిండాయి. దీంతో నదీ, వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీటి మట్టాలు పెరిగాయని రైతులు సంతోషిస్తున్నారు.
మండలం కురవాల్సింది కురిసింది
(మిల్లీమీటర్లు) (మిల్లీ మీటర్లు)
అల్లాదుర్గం 539 1,210
పెద్దశంకరంపేట 538 1,172
రేగోడ్ 547 1,047
టేక్మాల్ 496 1,006
రామాయంపేట 492 1,070
చేగుంట 540 1,115
వెల్దుర్తి 495 1,004
తూప్రాన్ 463 943