
- పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభపై సమీక్షించిన కేటీఆర్
- హుజూరాబాద్ బైపోల్ ప్రచారంలో హరీశ్ బిజీ
హైదరాబాద్, వెలుగు:మంత్రి హరీశ్‌రావు లేకుండానే ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రివ్యూ చేశారు. హుజూరాబాద్ బైపోల్ ప్రచారంలో బిజీగా ఉన్న హరీశ్‌రావు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్, పటాన్‌చెరు, మెదక్, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల నేతలతో గురువారం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. పార్టీ ప్లీనరీ, వరంగల్ విజయ గర్జన సభపై చర్చించారు. హరీశ్ ఈ నెల 17న నిర్వహించిన పార్టీ జాయింట్ ఎల్పీ మీటింగ్‌కూ ప్రచారం కారణంగా హాజరుకాలేదు. ఎన్నికల ప్రచారం కారణంగా ఈ నెల 25న నిర్వహించే ప్లీనరీకి కూడా ఆయన హాజరవడం అనుమానమేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ భవన్‌లో వరుసగా నాలుగో రోజు కేటీఆర్ పార్టీ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. గురువారం నాటి సమావేశంలో మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ద్వి దశాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, వరంగల్ విజయగర్జన సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలన్నారు.
టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి 16 సెట్ల నామినేషన్లు
టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ 16 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది.