భూమి దక్కదేమోనన్న బెంగతో వృద్ధుడు ఆత్మహత్య.. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

భూమి దక్కదేమోనన్న బెంగతో వృద్ధుడు ఆత్మహత్య.. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

శివ్వంపేట, వెలుగు : యాభై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇద్దరు వ్యక్తులు పట్టా చేసుకొని, తనను భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్న మనస్తాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో జరిగింది. 

బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఉప్పునూతల సత్యనారాయణ (60) ఆదివారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగగా.. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే తూప్రాన్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌‌ గాంధీ హాస్పిటల్‌‌కు తరలించగా.. ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. 

కాగా, తాము 50 ఏండ్లుగా రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఆ భూమి తమదేనంటూ అదే గ్రామానికి చెందిన చిట్టబోయిన మల్లేశ్‌‌, చిట్టబోయిన శ్రీనివాస్‌‌ బెదిరిస్తున్నారని సత్యనారాయణ భార్య మీన ఆరోపించారు. తాము వరి నాటు వేసుకుంటుంటే అడ్డుకోవడమే కాకుండా.. తమపై దాడికి దిగడంతో పాటు భూమిలో నుంచి వెళ్లిపోవాలని బెదిరించారన్నారు. 

భూమి పోతే బతుకు ఎలా అన్న బెంగతోనే తన భర్త సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు శివ్వంపేట పోలీసులు తెలిపారు.