మూడు రోజుల పాటు కుండపోత వానకు బ్రేక్.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మెదక్

మూడు రోజుల పాటు కుండపోత వానకు బ్రేక్.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మెదక్
  •  పలు చోట్ల రోడ్లు రిపేర్
  • కరెంట్ సరఫరా పునరుద్ధరణ
  • బాధితులకు సహాయక చర్యలు

మెదక్, వెలుగు: మెదక్​ జిల్లాలో మూడు రోజుల పాటు కుండపోత వాన కురిసి అతలాకుతలం చేయగా శనివారం గెరువిచ్చింది. దీంతో అధికార యంత్రాంగం రోడ్లు, చెరువులు, విద్యుత్ మరమ్మతులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టింది. భారీ వర్షాలు కురవడంతో హవేలీ ఘనపూర్ మండలంతో పాటు మెదక్, రామాయంపేట, నిజాంపేట మండలాలలో రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.

 ఆయా మండలాల పరిధిలో 15 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా  ట్రాన్స్ కో అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టి విద్యుత్​సరఫరా పునరుద్ధరించారు. ఇరిగేషన్ అధికారులు చెరువులకు గండ్లు, బుంగలు పడ్డ చోట మరమ్మతులు చేపట్టారు. 

రాకపోకలు పునరుద్ధరణ..

హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామ శివారులో చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు పూర్తిగా కొట్టుకు పోయి అటు వైపు ఉన్న నాలుగు గ్రామాలు, పలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని గ్రామాలకు సైతం రాకపోకలు బంద్ అయ్యాయి. శనివారం బూర్గుపల్లి దగ్గర రోడ్డు మరమ్మతు చేయడంతో రాకపోకలకు ఇబ్బంది తొలగిపోయింది. లింగసాన్ పల్లి తండా దగ్గర వరద ప్రవాహంతో బ్రిడ్జి, రోడ్డు తెగి రెండు రోజులు రాకపోకలు బంద్ కాగా మట్టి పోసి మరమ్మతు చేశారు. కామారెడ్డి జిల్లా నుంచి భారీ వరద రావడంతో ధూప్ సింగ్ తండాకు వెళ్లే మార్గంలో బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. నాలుగు రోజులుగా తండా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం అధికారులు రోడ్డు రిపేర్ చేసి తండాకు రాకపోకలు పునరుద్ధరించారు. 

మెదక్ లో పారిశుధ్య పనులు 

మెదక్ పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పనులు పర్యవేక్షించారు. వరద నీరు నిలిచిన కాలనీల్లో  పేరుకున్న చెత్తా చెదారం, మట్టి తొలగించారు. 

బాధితులకు అండగా ఉంటాం: ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కలెక్టర్ ​రాహుల్​ రాజ్

మెదక్​ టౌన్: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయియ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్​ రాహుల్​రాజ్​తెలిపారు. శనివారం హవేలీ ఘనపూర్​ మండలంలోని బూర్గుపల్లి, వాడి బ్రిడ్జి, కాప్రాయిపల్లి, ధూప్​సింగ్​ తండాతో పాటు పలు ప్రాంతాల్లో  బైక్​పై ప్రయాణించారు. దెబ్బ తిన్న రోడ్లు, పంట పొలాలు, వంతెనలను గ్రామస్తులు, రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులపై దృష్టిపెట్టామని చెప్పారు. పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు.