శివ్వంపేట, వెలుగు : తాను డిప్యూటీ జైలర్ అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసిన వ్యక్తిపై శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల కింద మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర సునీత, నర్సింలు దంపతులు కుటుంబం విషయంలో గొడవ పడ్డారు. ఆదివారం సునీత భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు బయలు దేరింది. ఈ క్రమంలో శివ్వంపేట బస్టాండ్ సమీపంలో ఇదే మండల పరిధిలోని టిక్యా దేవమ్మగూడ తండా పంచాయతీ పరిధిలోని సామ్య తండాకు చెందిన కాట్రోత్ సురేశ్ ఆమెను ఆపి ఎక్కడకు వెళ్తున్నావని అడిగాడు.
ఆమె ఇంట్లో జరిగిన గొడవ గురించి అతడికి చెప్పగా, అతను ఆమె భర్త నర్సింలుకు ఫొన్ చేసి ‘నేను సంగారెడ్డి జిల్లా కంది జైలు డిప్యూటి జైలర్ మాట్లాడుతున్నాను. నీ భార్య ఎస్పీ ఆఫీసులో నీపై ఫిర్యాదు చేసింది. నిన్ను ఎస్పీ జైలుకు తీసుకురమ్మన్నారు’ అని చెప్పాడు. దీంతో నర్సింలు అనుమానించి తనకు వచ్చిన ఫోన్ నంబర్ ఎవరిదని ఆరా తీయగా సామ్య తండాకు చెందిన సురేశ్ దిగా తేలడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా, నిందితుడు సురేశ్ నర్సాపూర్‌లో జరిగిన హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లి కొద్ది రోజుల కింద బెయిల్‌పై బయటకు రావడంతో పాటు, గతంలో లింగోజిగూడలో విద్యుత్ ఏఈనంటూ డబ్బులు వసూలు చేసిన మరో కేసులోనూ నిందితుడిగా ఉన్నాడని ఎస్సై వెల్లడించారు.
