అధికారులపై మెదక్​ అడిషనల్ కలెక్టర్​ ఆగ్రహం

అధికారులపై మెదక్​ అడిషనల్ కలెక్టర్​ ఆగ్రహం

    వర్క్స్​ స్పీడప్​ చేయాలని ఆఫీసర్లకు ఆదేశం 

మెదక్ (శివ్వంపేట), వెలుగు : మనఊరు  మనబడి కింద మంజూరైన పనులు చేపట్టడంలో జాప్యంపై మెదక్​ లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ అసహనం వ్యక్తం చేశారు.‘నేను పనుల పరిశీలనకు వచ్చిన  ప్రతీసారి జాప్యంపై ఏదో కారణం చెబుతున్నారు.. సాకులు చెప్పడం తప్ప పనులు చేయరా..  ఇది కరెక్ట్  కాదు.. ఇంట్రెస్ట్ పెట్టండి.. పనులు జరిగేలా చూడండి’ అని ఆఫీసర్లను ఆమె ఆదేశించారు. బుధవారం శివ్వంపేట జడ్పీ హై స్కూల్ ను ఆమె సందర్శించారు.  మన ఊరు మన బడి స్కీమ్ లో భాగంగా టాయిలెట్స్ నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ రూ.36 లక్షలు, ప్రహారి నిర్మాణానికి రూ.18 లక్షలు, కిచెన్ షెడ్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. 

అయితే  కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇప్పటి వరకు మూడుసార్లు పాఠశాలను పరిశీలించి పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో  పది రోజుల కింద కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. కానీ పనులు ఇంకా ప్రారంభించకపోవడంతో ఎందుకు డిలే చేస్తున్నారని అధికారులను అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించారు. కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు పెద్ద చెట్లు అడ్డుగా ఉన్నందున పనులు ఆగిపోయాయని అధికారులు చెప్పడంతో అడిగిన ప్రతీసారి ఏదో ఒక కారణం చెప్పొద్దని, వెంటనే పనులు జరిగేలా చూడాలని  ఆమె చెప్పారు.  

టాయిలెట్స్,  కిచెన్ షెడ్డు పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను, ఆఫీసర్లను ఆదేశించారు. శివ్వంపేట లో ప్రభుత్వ జూనియర్ కాలేజి బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అలాట్  చేయాలని అడిషనల్ కలెక్టర్ తహసీల్దార్ కు సూచించారు. అంతకుముందు ఆమె కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి కింద సింగరేణి సంస్థ నుంచి రూ 2.28 కోట్లు మంజూరు అయిన చిన్న గొట్టిముక్కల జడ్పీ హైస్కూల్ ను సందర్శించారు. ఆ నిధులతో చేపట్టే పనుల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.  పనులు వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంపీపీ హరికృష్ణ, డీఈవో రమేశ్, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎంపీడీవో నవీన్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ భాస్కర్, స్పెషల్ ఆఫీసర్ నర్సయ్య ఉన్నారు. 

అడిషనల్ ​కలెక్టర్​కు గర్ల్స్​ కాలేజీ స్టూడెంట్స్​ వినతి 

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ చుట్టూ డ్రైనేజీ ఉండడంతో పందులు సంచరిస్తున్నాయని, దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యుడు జగన్​అన్నారు. ఈ మేరకు బుధవారం విద్యార్థినులతో కలిసి మెదక్​ కలెక్టరేట్​కు వెళ్లి అడిషనల్​కలెక్టర్ ప్రతిమాసింగ్​కు మెమోరాండం సమర్పించారు. కాలేజీ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వారు స్పష్టం చేశారు.