- అవినీతి ఆరోపణలకే ఆ పార్టీల నేతలు పరిమితం
- మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్, కృష్ణా జలాలపై చిత్తశుద్ధిలేని చర్చ జరుగుతుందని, సభలో ఒకరినొకరు తిట్టుకోడానికే అధికార, ప్రతిపక్షాలు పరిమితమయ్యాయని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఐబీ గెస్ట్ హౌజ్‌లో నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరితో కలిసి రాబోయే మున్సిపల్ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చించారు.
అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో సంతకాలు చేసిన పత్రాలను ప్రజల ముందు ఉంచామని తెలిపారు. పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారినా, బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఆ పార్టీలకు విజన్ లేదని, నాణేనికి బొమ్మ, బొరుసులా మారాయని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రధా న కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నేతలు పాల్గొన్నారు.
