
- సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో దొంగ ఓట్లను తొలగించండి: రఘునందన్ రావు
- రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో దొంగ ఓట్లను తొలగించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. చిన్న గ్రామమైన ఐలాపూర్‌లో ఓటర్ల సంఖ్య అసాధారణంగా పెరిగిందని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఐలాపూర్‌లో కేవలం 950 ఓట్లు ఉండాల్సిన చోట, ఇప్పుడు ఏకంగా 1,650 ఓట్లు ఉన్నాయని తెలిపారు. దాదాపు 700 ఓట్లు అక్రమంగా పెంచారని ఆయన ఆరోపించారు.
శ్మశానవాటిక, బోరింగ్, ట్యాంక్‌కు కూడా ఇంటి నంబర్లు ఇచ్చి ఓటర్లను అక్రమంగా చేర్చారన్నారు. ఈ విషయంపై గతంలో ఆ గ్రామ సర్పంచ్‌తో కలిసి తహసీల్దార్, కలెక్టర్‌తో పాటు అప్పటి సీఈవో వికాస్ రాజును కలిసి ఫిర్యాదు చేసినట్టు గుర్తుచేశారు. దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, దొంగ ఓట్లను తొలగించడానికి కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. బెంగళూరులో రెండు దొంగ ఓట్లను చూసి మాట్లాడుతున్నారని, వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి రోహింగ్యాలు వచ్చి దొంగ ఓట్లు నమోదు చేసుకుంటుంటే ఎందుకు తొలగించడం లేదని ఆయన నిలదీశారు.