మెదక్​ జిల్లాలో బీఆర్ఎస్​కు ఝలక్​ .. కాంగ్రెస్​ ఖాతాలోకి మెదక్ మున్సిపాలిటీ

మెదక్​ జిల్లాలో బీఆర్ఎస్​కు ఝలక్​ .. కాంగ్రెస్​ ఖాతాలోకి మెదక్ మున్సిపాలిటీ
  • మదన్​రెడ్డి, చంద్రపాల్ పార్టీ మార్పుతో రెండు సెగ్మెంట్లలో ఎఫెక్ట్​

మెదక్, నర్సాపూర్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఝలక్ తగిలింది. జిల్లాలోని నర్సాపూర్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కీలక నేతలు తమ అనుచర వర్గంతో కాంగ్రెస్​లో చేరారు. అలాగే ఇటీవల తూప్రాన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్​ చేజారి కాంగ్రెస్ వశమైన సంగతి తెలిసిందే.  తాజాగా మెదక్ మున్సిపాలిటీ సైతం హస్తగతం అయింది. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో హైదరాబాద్​తరలివెళ్లి  గాంధీభవన్​లో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. అలాగే మెదక్​ మున్సిపాలిటీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, 9 మంది కౌన్సిలర్లు, ఓ కో ఆప్షన్ మెంబర్ కూడా కాంగ్రెస్​లో చేరారు. 

కాంగ్రెస్​కు ​మెజార్టీ ఓట్లు లభించే అవకాశం

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి విజయం సాధించడంలో మదన్ రెడ్డి, ఆయన వర్గం ఎంతో సహకరించింది. మదన్ రెడ్డి మద్దతు ఇవ్వకుంటే సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కష్టమయ్యేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా తనకు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. 

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి మాట తప్పింది. దీంతో నారాజ్ అయిన మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్​లో చేరారు. ఆయనతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సెకండ్​ క్యాడర్​ నాయకులందరూ కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యారు. దీంతో నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలహీన పడి కాంగ్రెస్ బలపడినట్టయింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ ఓట్లు లభించే అవకాశం ఉందని రాజకీయ  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఊహించని దెబ్బ

మెదక్ పట్టణంలో కూడా బీఆర్ఎస్​కు ఊహించని దెబ్బతగిలింది. మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, 9 మంది కౌన్సిలర్లు, ఓ కో- ఆప్షన్ మెంబర్ కాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే  ముగ్గురు కౌన్సిలర్లు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు గంగాధర్ సైతం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్​లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట రామాయంపేట మున్సిపాలిటీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు  బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్​లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఇపుడు మెదక్ చైర్మన్​తో సహా 10 మంది కౌన్సిలర్లు,  రామాయంపేట మున్సిపాలిటీ నలుగురు కౌన్సిలర్ల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడినట్టయింది. ఒకరొకరుగా ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ డీలా పడింది. ఇది లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.