నేడే మెదక్​ జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్

నేడే మెదక్​ జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్
  • కొత్త మండలాలకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని గత జడ్పీ సమావేశంలో మంత్రి ఆదేశం
  • మూణ్నెళ్లైనా ఫండ్స్​ముచ్చటే లేదు.. మండలాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే.. 

మెదక్ (నిజాంపేట, చిలప్​చెడ్​), వెలుగు : కొత్తగా ఏర్పడిన ఆరు మండలాలకు వెంటనే రూ.5 లక్షల చొప్పున  మంజూరు చేయాలని మంత్రి హరీశ్​రావు ఆదేశించినా ఫలితం లేదు. మూడు నెలలైనా ఒక్క మండలానికి కూడా ఒక్క రూపాయి రిలీజ్​ కాలేదు. మూడు నెలల కింద నిర్వహించిన మెదక్​ జడ్పీ సమావేశంలో పలు అభివృద్ధి పనుల కోసం ప్రతీ కొత్త మండలానికి రూ.5 లక్షల చొప్పున ఫండ్స్​ కేటాయించాలని మంత్రి హరీశ్​రావు కలెక్టర్​ను ఆదేశించినా నిధులు ఇవ్వకపోవడంతో కొత్త మండలాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 

గత మీటింగ్​లో... 

గత సెప్టెంబర్ 22న జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో కొత్త మండలాల్లో ఫండ్స్​ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, ఫర్నీచర్​ లేదని, ఆఫీసుల కిరాయి కట్టడానికి తిప్పలు పడాల్సి వస్తోందని చిలప్​చెడ్ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, నార్సింగి ఎంపీపీ సబిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి హరీశ్​రావు స్పందిస్తూ  ఆ మండలాలకు రూ.5 లక్షలు కేటాయించాలని కలెక్టర్​ను ఆదేశించారు. ఈ క్రమంలో ఇతర కొత్త మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు సైతం తమ మండలాల్లో కూడా అదే పరిస్థితి ఉందని, తమకు కూడా ఫండ్స్​ కావాలని కోరారు. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆరు మండలాలకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలని మంత్రి కలెక్టర్​ కు సూచించారు. అయితే జడ్పీ మీటింగ్​ జరిగి మూడు నెలలై మళ్లీ మీటింగ్​ సమయం వచ్చినా ఇంతవరకు ఆయా మండలాలకు ఫండ్స్​ రాలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. శనివారం జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​జరుగనుండగా కొత్త మండలాల్లో నెలకొన్నసమస్యలు మరోమారు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. 

కొత్త మండలాల పరిస్థితి ఇదీ.. 

ప్రభుత్వం 2016లో మెదక్ జిల్లాలో కొత్తగా హవేలీఘనపూర్, నిజాంపేట, నార్సింగి, మనోహరాబాద్, చిలప్​చెడ్ ​మండలాలను ఏర్పాటు చేసింది. ఆ తరువాత దాదాపు రెండేళ్ల కిందట మాసాయిపేట మండలం ఏర్పాటైంది. కాగా ఆయా మండల​ కేంద్రాల్లో రెండు, మూడు చోట్ల మినహా ఎంపీడీఓ, తహసీల్దార్​, అగ్రికల్చర్, ఐకేపీ ఆఫీసులు​, పోలీస్​ స్టేషన్లు​ కిరాయి బిల్డింగ్​ ల్లో, పెంకుటిండ్లలో ఏర్పాటు చేశారు. వాటిలో ఆఫీస్​ నిర్వహణకు అనుకూలంగా రూమ్​లు, వసతులు లేవు. దీంతో ఆయా ఆఫీసులలో పనిచేసే అధికారులు, ఉద్యోగులతోపాటు, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు అవస్థలు పడుతున్నారు. నిజాంపేటలో అనువైన బిల్డింగ్​ దొరకకపోవడంతో తహసీల్దార్​ ఆఫీస్​ ను పెంకుటింట్లో ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా ఆయా సమస్యలను కొంతవర‌‌‌‌కైనా పరిష్కరించుకుందామనుకుంటే ఫండ్స్​లేక ఇబ్బంది అవుతోందని ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఫండ్స్​ మంజూరు చేయాలి

కొత్త మండలం ఏర్పాటైనప్పటికీ ఆఫీసులకు సొంత బిల్డింగ్​లు లేక ఇబ్బంది అవుతోంది. గత జడ్పీ మీటింగ్​లో ఈ విషయాల గురించి మాట్లాడితే మంత్రి మండలానికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పారు. కానీ ఇంతవరకు రాలేదు. వెంటనే ఆ ఫండ్స్​ మంజూరు చేస్తే కొంత వరకైనా సమస్యలు తీరుతాయి.  

- వినోద దుర్గారెడ్డి, ఎంపీపీ చిలప్​ చెడ్