
మెదక్, వెలుగు: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జనరల్, బీసీలకు రిజర్వ్ అయిన చోట ఆశావహులు ఎక్కువ మంది టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది.
9 చోట్ల బీసీలకు ఛాన్స్
మెదక్, చేగుంట, పాపన్నపేట, చిన్న శంకరంపేట, రేగోడ్, హవేలీ ఘనపూర్, కౌడిపల్లి, నర్సాపూర్, శివ్వంపేట జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే దాని గురించి తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతోంది.
జనరల్ స్థానాల్లో ఆశావహులు ఎక్కువ..
తూప్రాన్, కొల్చారం, రామాయంపేట, పెద్దశంకరంపేట, మనోహరాబాద్, నిజాంపేట జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు జనరల్ గా ఉన్నాయి. దీంతో ఆయా స్థానాల్లో టికెట్ల కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ముగ్గురు మొదలుకొని, ఏడెనిమిది మంది వరకు రేసులో ఉన్నారు. గెలుపే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షుల ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వైస్ ఎంపీపీ పదవులపై..
వెల్దుర్తి, మాసాయిపేట, చిలప్ చెడ్, నార్సింగి, అల్లాదుర్గం, టేక్మాల్ ఎంపీపీ పదవులు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్కావడంతో ఆయా పదవులు ఆశించిన ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ఓసీ, బీసీ నాయకులు ఆయా చోట్ల వైస్ ఎంపీపీ పదవులపై దృష్టిపెట్టారు. ఎంపీటీసీగా గెలిచి వైస్ ఎంపీపీ పదవి దక్కించుకుంటే మండలంలో చక్రం తిప్పొచ్చని భావిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో..
నార్సింగి జడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ ఎస్సీ జనరల్, మాసాయిపేట జడ్పీటీసీ ఎస్సీ మహిళ, ఎంపీపీ ఎస్సీ మహిళ, వెల్దుర్తి జడ్పీటీసీ ఎస్సీ మహిళ, ఎంపీపీ ఎస్సీ జనరల్, అల్లాదుర్గం జడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. చిలప్ చెడ్ జడ్పీటీసీ, ఎంపీపీ ఎస్టీ మహిళలకు, టేక్మాల్ మండల జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఆయా చోట్ల ఎవరిని బరిలో దించాలనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి.