మేడారం బస్సులు, పార్కింగ్.. సకల వివరాలు ఫోన్​లోనే

మేడారం బస్సులు, పార్కింగ్.. సకల వివరాలు ఫోన్​లోనే
  • రూట్ మ్యాప్,​ బస్సులు, పార్కింగ్.. సకల వివరాలు ఫోన్​లో
  • వెబ్​సైట్, యాప్​ను లాంచ్​చేసిన ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ములుగు, వెలుగు: మేడారం మహాజాతరకు తరలివెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం అధికారిక వెబ్​సైట్​తోపాటు మొబైల్​ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ములుగు కలెక్టర్ ​కృష్ణ ఆదిత్య అధికారులతో కలిసి వెబ్​సైట్​తోపాటు, యాప్​ను ఇటీవలే లాంచ్ ​చేశారు. వనదేవతల వద్దకు చేరుకునేందుకు రూట్​మ్యాప్, సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద సమాచారం, జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వివిధ రకాల సౌలత్​లు ఈ యాప్ ​ద్వారా తెలుసుకోవచ్చు. 2018 జాతర నుంచి ఇలాంటి సేవలు భక్తులకు అందిస్తున్న ఆఫీసర్లు ప్రతీ సారి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ నెల16 నుంచి19 వరకు జరిగే మహా జాతరకు కోటి మందికిపైగా భక్తులు తరలిరానున్నారని అంచనా. తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

యాప్​లో ఏముందంటే..

మేడారం, ఊరట్టం, సమ్మక్క కొలువైన చిలుకలగుట్ట, సారలమ్మ కొలువైన కన్నెపల్లి, రెడ్డిగూడెం, బస్టాండ్ ఏరియా, నార్లాపూర్​ తదితర ప్రాంతాలను ట్యాగ్​చేస్తూ ఆయా శాఖల క్యాంపులను అనుసంధానం చేశారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్​ సెంటర్లు, ల్యాండ్​ మార్క్స్, పార్కింగ్ ​ప్లేసెస్, టాయిలెట్స్, హెల్త్​ క్యాంపులు, స్నాన ఘట్టాలు, బస్ ​పాయింట్లు, మిస్సింగ్ అంశాలు యాప్​లో పొందుపరిచారు. యాప్​లో ఆఫ్​లైన్​ నావిగేషన్​ సౌకర్యం కల్పించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో యాప్​లో మరో 9 రకాల సేవలను అందుబాటులో ఉంచారు. మేడారం చేరుకోవడం, మేడారం నుంచి వారి ప్రాంతాలకు వెళ్లడం, ఏదైనా ఇన్సిడెంట్లు జరిగితే రిపోర్టు చేయడం, మిస్సింగ్​అనౌన్స్​మెంట్​సెంటర్, రిపోర్ట్​ మిస్సింగ్​పర్సన్, పోలీసుల గైడ్​లైన్స్, ట్రాఫిక్, కరోనా రూల్స్​పొందుపరిచారు. ఎలాంటి సహాయం కావాలన్నా ఈ యాప్​ ద్వారా పొందవచ్చు. ట్రాఫిక్ ​అప్​డేట్స్ కోసం మేడారానికి వెళ్లే ప్రధాన రూట్లను లింక్​చేశారు. ములుగు నుంచి పస్రా, మేడారం నుంచి పస్రా, ములుగు నుంచి ఆత్మకూరు, ఆత్మకూరు నుంచి వరంగల్ ఇలా రూట్ల వారీగా గూగుల్​మ్యాప్​కు ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో అనుసంధానించారు. 

ఎలా డౌన్​లోడ్​చేసుకోవాలి?

యాప్​డౌన్​లోడ్​చేసుకోవాలనుకుంటున్న వారు  www.medaramjathara.com సైట్​నుంచి డౌన్​లోడ్​చేసుకోవచ్చు. లేదా ప్లేస్టోర్​లో ‘మేడారం జాతర గైడ్​– అఫీషియల్’ పేరుతో ఉన్న యాప్​ను డౌన్​లోడ్​చేసుకోవచ్చు. 

భక్తులకు ఇబ్బంది లేకుండా..

మేడారం జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని వివరాలతో యాప్, వెబ్​సైట్​ అందుబాటులోకి తీసుకొచ్చాం. పోలీసు, రెవెన్యూ, మెడికల్, ఎండోమెంట్ ​శాఖల సేవలన్నీ ఒకే దగ్గరకు తెచ్చాం. జాతర రూట్​ మ్యాప్, బస్సు సర్వీసులు, అమ్మవార్ల గద్దెలు, జంపన్నవాగు, హెల్త్​క్యాంపుల వివరాలు భక్తులు పొందవచ్చు. యాప్​లో వివరాలను వాడుకొని భక్తులు కరోనా రూల్స్ ​పాటిస్తూ.. అమ్మవార్లను దర్శించుకోవాలి.

- కృష్ణ ఆదిత్య, కలెక్టర్, ​ములుగు జిల్లా