
మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు: ఆదివాసీల అభీష్టం మేరకే మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల పునఃనిర్మాణం, శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో బుధవారం పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... పదేండ్లు అభివృద్ధిని పట్టించుకోని బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఆదివాసీల అస్తిత్వం, భక్తి, విశ్వాసం పరిఢవిల్లేలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మేడారం, వేములవాడను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే వెనుకబాటుకు గురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం వేములవాడతో పాటు మేడారంలోనూ అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయన్నారు.
కొత్తగూడ మండల పరిధిలోని పగిడిద్దరాజు ఆలయాన్ని పూజారుల నిర్ణయం మేరకే డెవలప్‌చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ మారుమూల ప్రాంతాలను పూర్తిగా విస్మరించిందన్నారు. కొందరు బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కుమార్తె కవిత చేసిన విమర్శలపై ఆ కుటుంబానికి చెందిన ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. అంతకుముందు కొత్తగూడలో 30 పడకల హాస్పిటల్, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎంహెచ్‌వో రవి రాథోడ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.