మేడారానికి ప్లాస్టిక్ ముప్పు!..నేల, నీరు, గాలి కలుషితం

మేడారానికి ప్లాస్టిక్ ముప్పు!..నేల, నీరు, గాలి కలుషితం
  • గత జాతరలో 12 వేల టన్నుల చెత్త.. ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలే
  • నేల, నీరు, గాలి కలుషితం.. అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులపై ఎఫెక్ట్​
  • ఈ సారి 2 కోట్లకుపైగా భక్తులు వచ్చే చాన్స్.. ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావొద్దని ఫారెస్ట్ ఆఫీసర్ల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:  వనదేవతల పండుగకు వేళైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం ముస్తాబైంది. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. జాతరలో పారిశుధ్య, ప్లాస్టిక్ నిర్వహణ, జాతర ముగిశాక మిగిలే ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు పొంచి ఉంది. అడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ఇది ఆఫీసర్లకు పెద్ద సవాలుగా మారనున్నది. ఏటా జాతర తర్వాత అభయారణ్యంలో విచ్చలవిడిగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి.. అటు మూగజీవాలకు ప్రాణసంకటంగా మారుతున్నది. గత జాతరలో ఏకంగా 12 వేల టన్నుల చెత్త పేరుకుపోగా.. అందులో సగభాగం ప్లాస్టిక్ భూతమే. ఈ సారి 2 కోట్ల మందికి పైగా జనం వస్తుండటంతో.. ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత పెరిగే చాన్స్ ఉంది.

మేడారం జాతరలో వాడుతున్న ప్లాస్టిక్ తో చెత్త పేరుకుపోవడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు నేల, నీరు, గాలి కలుషితమవుతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి  మేడారాన్ని ‘ప్లాస్టిక్ ఫ్రీ’గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వనదేవతల పవిత్రతను, అడవి స్వచ్ఛతను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపడ్తున్నది.

నేల, నీరు, గాలి కలుషితం

భక్తులు పవిత్రంగా భావించే జంపన్న వాగు ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నది. స్నానాలు చేసే సమయంలో వాడే షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, వాటర్ బాటిళ్లు వాగులో పారేస్తుంటారు. దీనిద్వారా నీటి ప్రవాహానికి అడ్డుపడటమే కాకుండా ప్లాస్టిక్ నుంచి విడుదలయ్యే రసాయనాలు నీటిలో కలిసి జలచరాలకు ముప్పు వాటిల్లుతున్నది. అంతేకాదు, వాగు అడుగుభాగంలో ప్లాస్టిక్ పేరుకుపోయి ప్రమాదం లేకపోలేదు. భక్తులు పడేసే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు మట్టిలో కరగకుండా ఏండ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. ఇది మట్టిలో ఉండే వానపాములు, ఇతర సూక్ష్మజీవులను చంపేస్తున్నది. వర్షం పడినా నీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ పొర అడ్డుపడుతుందని, అడవిలో చెట్ల వేర్లకు నీరు అందక ఎండిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను కొన్నిసార్లు అక్కడే కాల్చేస్తుంటారు. దీనివల్ల డయాక్సిన్, ప్యూరాన్ వంటి ప్రమాదకర వాయువులు గాలిలో కలుస్తున్నాయని చెప్తున్నారు. జాతరకు వచ్చే భక్తులతో పాటు స్థానిక గిరిజనుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దుర్వాసనతో గాలి నాణ్యత పడిపోతోందంటున్నారు. మేడారం పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో జింకలు, కోతులు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. భక్తులు మిగిల్చిన ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో ఉండటంతో అలాగే తినడంతో జంతువులు కవర్లను జీర్ణించుకోలేక, కడుపులో ప్లాస్టిక్ గడ్డకట్టి మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యాల్లో ప్లాస్టిక్ కారణంగా అనేక జంతువులు అనారోగ్యం పాలవుతున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బయోప్లాంట్​కు వ్యర్థాల తరలింపు

గత జాతరలో సుమారు 12 వేలకుపైగా మెట్రిక్ టన్నుల వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించారు. ఇందులో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలే 400 నుంచి 500 టన్నుల వరకు ఉన్నాయి. ఈసారి జాతరలో ఒక్కో వ్యక్తి నుంచి సగటున 500 గ్రాముల చెత్త వస్తుందని అంచనా.. ఈ లెక్కన దాదాపు 20 వేల టన్నులపైగా వ్యర్థాలు పోగయ్యే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. జాతరలో మందు బాటిళ్లు, బీరు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల వినియోగం ఎక్కువగా ఉంటున్నది. ఈ చెత్తనంతా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు 24 గంటల షిఫ్టుల్లో పనిచేసేలా 10 వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. చెత్త తరలింపునకు ట్రాక్టర్లు, జేసీబీలు, డోజర్లను సిద్ధం చేశారు. జాతరలో బలి ఇచ్చే కోళ్లు, మేకల వ్యర్థాలతో దుర్వాసన రాకుండా వాటిని బయో ప్లాంట్‌‌‌‌కు తరలించి శాస్త్రీయంగా నిర్మూలించనున్నారు. వాష్​రూమ్, మరుగుదొడ్ల నుంచి వాసన రాకుండా కెమికల్​స్ప్రే చేయనున్నారు. ఫినాయిల్, ఇతర రసాయనాలను వాడనున్నారు. రోజు ఫాగింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు వేలసంఖ్యలో పారిశుధ్య కార్మికులు, ట్రాక్టర్లు, జేసీబీలను సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. భక్తుల సహకారం లేనిదే ప్లాస్టిక్ ఫ్రీ మేడారం సాధ్యం కాదని, ఇంటి నుంచి వచ్చేటప్పుడే ప్లాస్టిక్ సంచులు తీసుకురావొద్దని, గుడ్డ సంచులు తెచ్చుకోవాలని ఫారెస్ట్​ అధికారులు కోరుతున్నారు.


శబరిమల మోడల్ అమలు చేయాలె..

కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతంగా అమలవుతున్నది. అక్కడకు కోట్లాది మంది భక్తులు వెళ్తున్నా.. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎక్కడా కనిపించవు. వాహనాల తనిఖీల్లోనే ప్లాస్టిక్‌‌ను సీజ్ చేసి ప్రత్యామ్నాయ వస్తువులను అందిస్తా రు. ఇదే విధానాన్ని అమలు చేస్తే మేడారం ప్లాస్టిక్ ఫ్రీ సాధ్యమవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందుకోసం అడవిలోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు తీసుకెళ్లకుండా పటిష్టమైన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సింగిల్ యూజ్డ్​ ప్లాస్టిక్‌‌ను పూర్తిగా నిషేధించి.. భక్తులు క్లాత్​, జనపనార సంచులను వాడేలా విస్తృత ప్రచారం కల్పించాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

20 డంపింగ్ యార్డులు

వ్యర్థాల నిర్వహణ కోసం మేడారం చుట్టూ 20 డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం పెద్ద టాస్క్ కావడంతో స్థానిక ఏజెన్సీల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతరలో బలి ఇచ్చే కోళ్లు, మేకల వ్యర్థాలతో దుర్వాసన, కాలుష్యం రాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) రంగంలోకి దిగింది. మాంసం వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి బయో ప్లాంట్‌‌‌‌కు తరలించనున్నారు. అలాగే, గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారం, బండారి, చీరె, జాకట్, కొబ్బరికాయలు, ఇతర పదార్థాలను కూడా వేరు చేసి రీ సైక్లింగ్‌‌‌‌కు పంపనున్నారు.

ప్లాస్టిక్ ఫ్రీ మేడారానికి భక్తులు సహకరించాలి

మేడారం మహాజాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భక్తులు కేవలం భక్తితోనే కాకుండా బాధ్యతతో వ్యవహరించాలి. అడవి మార్గం, జాతర పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు పడేయొద్దు. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్, కాపర్ బాటిళ్లు తెచ్చుకోవాలి. జంపన్న వాగు, క్యూలైన్లలో వాటర్ కియోస్క్‌‌‌‌లు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినం. జాతరకు ముందు మేడారం ఎంత స్వచ్ఛంగా ఉందో.. జాతర తర్వాత కూడా అలాగే ఉండేలా చర్యలు చేపడుతున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ మేడారం కోసం భక్తులు సహకరించాలి. రోడ్లు, అడవిలో ప్లాస్టిక్ వేయొద్దని మైకుల ద్వారా ప్రచారం చేయడంతో పాటు వాలంటీర్ల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం.
– డీపీవో వెంకయ్య