మేడారం జాతరకు రికార్డు స్థాయి ఆదాయం.. రూ.13 కోట్ల 25 లక్షలు

 మేడారం జాతరకు రికార్డు స్థాయి ఆదాయం.. రూ.13 కోట్ల 25 లక్షలు
  • గత జాతర కంటే రూ.కోటి 80 లక్షలు అదనం
  • 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు
  • ముగిసిన హుండీల లెక్కింపు

వరంగల్, వెలుగు: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటి సారి రూ.13 కోట్లు దాటింది. ఇప్పటివరకు జరిగిన జాతరల్లో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదైంది. 2022 జాతర కంటే మరో రూ.కోటి 80 లక్షల ఇన్​కం పెరిగింది. బంగారం, వెండి కానుకలు కూడా పెరిగాయి. మొత్తంగా వరంగల్​లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈసారి జాతరలో 540 హుండీలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు, నాణేల రూపంలో రూ.13 కోట్ల 25 లక్షల 22 వేల 511 వచ్చింది.

 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా, రూ.11,45,34, 526  ఆదాయం వచ్చింది. తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లీగ్రాములు బంగారం,  55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయి. ఇతర దేశాలకు చెందిన 308 కరెన్సీ నోట్లు రాగా, ఇందులో యూఎస్​ డాలర్లు 272, ఖతార్​8, ఆస్ట్రేలియా 6, ఇంగ్లాండ్ 3, సింగపూర్ 2 నోట్లు వచ్చాయి. వీటిని ఫారిన్ ఎక్స్​చేంజ్​లో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలపనున్నట్లు అధికారులు తెలిపారు. 

 ఎండోమెంట్​ శాఖ సొంత సిబ్బందితో పాటు మరో 200 మంది వలంటీర్ల సాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ ను విజయవంతంగా​ పూర్తి చేసింది. దేవాదాయశాఖ అకౌంట్లు ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్​ మెషీన్లతో వారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు.  వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్​మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్​కమిషనర్​ రామల సునీత, మేడారం ఈవో రాజేంద్రం  తెలిపారు.