వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయం ఆదివారం మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లేముందు వేములవాడ రాజన్న, భీమన్న స్వామివార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భీమేశ్వర ఆలయంలో స్వామి వారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
తెల్లవారుజామునే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం స్నానమాచరించి స్వామి వారి దర్శనానికి క్యూలెన్లలో వేచియున్నారు. భక్తుల రద్దీతో దర్శనానికి 3 గంటలకు పైగా పట్టింది. మరోవైపు రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో ఆలయం ముందు భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. -వేములవాడ, వెలుగు:
