మేడారం తుది దశ పనులను స్పీడప్ చేయండి..అధికారులు సమన్వయంతో పని చేయండి..

మేడారం తుది దశ పనులను  స్పీడప్ చేయండి..అధికారులు సమన్వయంతో పని చేయండి..
  • సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : మంత్రి సీతక్క

తాడ్వాయి/ములుగు, వెలుగు : మేడారం ఆలయంలో తుది దశ పనులను వేగంగా పూర్తి చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను సక్సెస్ చేయాలని మంత్రి సీతక్క ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నందున ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆమె పరిశీలించారు. 

ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న పీటీ బీమ్స్, క్యూ లైన్లు, మీడియా టవర్లు, గ్రానైట్ పనులను పరిశీలించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ములుగులో కలెక్టరేట్ బిల్డింగ్, పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 

సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పరస్పర సమన్వయంతో పనులు చేయాలని ఆదేశించారు. అంతకుముందు మేడారంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. 

కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్. మహేందర్, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పాల్గొన్నారు. అనంతరం నార్లాపూర్ గ్రామంలో ఇటీవల చనిపోయిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు.