మేడారం భక్తులతో యాదాద్రి కిటకిట

మేడారం భక్తులతో యాదాద్రి కిటకిట
  • జాతర ముగిసినా తగ్గని రద్దీ .. ఆదివారం 5 లక్షల మందికి పైగా రాక 
  • మొదలైన పారిశుధ్య పనులు.. రంగంలోకి 1,200 మంది కార్మికులు
  • శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం: మంత్రి సీతక్క 

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారం జాతరకు ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. శనివారం సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేయగా, ఆదివారం సెలవు రోజు కావడంతో 5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి తల్లుల గద్దెలను దర్శించుకున్నారు. చీరె సారె, ఒడిబియ్యం, పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు.  ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చారు. ఎటుచూసినా జనంతో మేడారం, దాని పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఇప్పుడు మహాజాతర ముగియడంతో మేడారం క్రమంగా ఖాళీ అవుతున్నది. వ్యాపారులు, భక్తులు గుడారాలు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. పోలీసులు సైతం వన్‌‌‌‌‌‌‌‌ వే రూట్‌‌‌‌‌‌‌‌ ఎత్తేశారు. 

ఎటుచూసినా వ్యర్థాలు..  

మహాజాతర సమయంలో మేడారం గద్దెలకు నలుదిక్కులా 10 కిలోమీటర్ల మేర ఏరియా ‌‌‌‌మొత్తం భక్తులతో నిండిపోయింది. గూడారాలు వేసుకుని భక్తులు బస చేశారు. వాళ్లు తినిపడేసిన ఆహార పదార్థాలు, కోళ్లు, మేకలను కోయగా వచ్చిన వ్యర్థాలు ఎక్కడివక్కడ పోగుపడ్డాయి. ఆరుబయట మల, మూత్ర విసర్జనలతో మేడారం పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. శనివారం చిరుజల్లులు కురవడంతో ఆ ప్రాంతాలన్నీ బురదమయంగా మారాయి. దీంతో అధికారులు వెంటనే పారిశుధ్య పనులు మొదలుపెట్టారు. 

మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో 1,200 మంది కార్మికులు రంగంలోకి దిగారు. రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన శానిటేషన్ సిబ్బంది మేడారం, దాని పరిసర గ్రామాల్లో విధులు ప్రారంభించారు. వీరికి వారం రోజుల పాటు ఇక్కడే వసతి సౌకర్యం కల్పించారు. మేడారం, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్‌‌‌‌‌‌‌‌ తదితర గ్రామాల్లో పరిసరాలన్నింటినీ సిబ్బంది క్లీన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.