బెల్లం వ్యాపారుల సిండికేట్.. సమ్మక్క మొక్కుల కోసం పెరిగిన డిమాండ్

బెల్లం వ్యాపారుల సిండికేట్..  సమ్మక్క మొక్కుల కోసం పెరిగిన డిమాండ్
  • ఇదే అదనుగా నాసిరకం విక్రయాలు
  • కిలోపై రూ.20 వరకు పెంచి దోపిడీ
  • భూపాలపల్లి జిల్లాలో పరిస్థితి

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: సమ్మక్క, సారలమ్మకు ప్రీతికరమైన ఎత్తు బంగారా(బెల్లం)నికి ప్రసుత్తం ఫుల్ డిమాండ్ ఉంది. మేడారం జాతర నేపథ్యంలో జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో ఊరూరా బెల్లం అమ్మకాలు పెరగాయి. ఇదే అదనుగా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి, సొమ్ము చేసుకుంటున్నారు.   

జోరుగా ఎత్తు బంగారం కొనుగోళ్లు

సమ్మక్క, సారలమ్మను ప్రతీ ఇంట్లో పసుపు, కుంకుమ రూపంలో కొలుస్తుంటారు. అడవి తల్లులకు ప్రీతికరమైన బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో ఏ ఊరిలో చూసినా ఎత్తు బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇంటికి 10 కిలోలకు తగ్గకుండా బెల్లం కొంటున్నారు. జిల్లా పరిధిలోని చాలా గ్రామాల్లో మినీ మేడారాన్ని తలపించేలా జాతర సాగుతుంది. భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట, కమలాపూర్, చిట్యాల మండలంలోని పూరేడుగుట్ట, మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి, రేగొండ మండలంలోని బుగులోను గుట్ట, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని పలు పల్లెల్లో జాతర ఏటా ఘనంగా జరుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు ఎత్తు బెల్లాలతో మొక్కులు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో కిరాణా షాపులు బెల్లం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. 

నిఘా పెంచిన అధికారులు

బెల్లం అమ్మకాల నేపథ్యంలో అధికారులు నిఘా పెంచారు. గుడుంబా తయారీదారులు బెల్లాన్ని భారీగా తరలించే అవకాశం ఉండటంతో తనిఖీలు చేస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో భూపాలపల్లి ఎక్సైజ్ శాఖ పరిధిలో 78 కేసులు నమోదు చేశారు. 545 లీటర్ల గుడుంబా, 15,400 లీటర్ల బెల్లం పానకం, 421 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకొని, 9 మందిని బైండోవర్  చేసినట్లు తెలిపారు.  

కిలో రూ.60 వరకు విక్రయం

సమ్మక్క జాతర నేపథ్యంలో బెల్లం వ్యాపారులు సిండికేట్​గా మారారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు టేకుమట్ల, కాటారం, రేగొండ మండలాల పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి టన్నుల కొద్దీ బెల్లాన్ని దిగుమత్తి చేస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. నెల రోజుల క్రితం కిలో బెల్లం రూ.45 వరకు ఉండగా ప్రస్తుతం రూ.55 నుంచి రూ.60 వరకు ధర పెంచి దోపిడీ చేస్తున్నారు. మిల్ట్ బెల్లాన్ని రూ.50 నుంచి రూ.55 వరకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు తక్కువ ధర ఆశ చూపుతూ నాసిరకం బెల్లాన్ని అమాయక భక్తులకు అంటగడుతున్నారన్న చర్చ జరుగుతోంది. నాసిరకం బెల్లం అమ్మకాలపై ఆఫీసర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. బుధ, గురువారాల్లో వ్యాపారులు చెప్పిందే రేటుగా నడుస్తోందని అంటున్నారు.