మేడారంలో భక్తుల సందడి లక్ష మంది వచ్చిన్రు

మేడారంలో భక్తుల సందడి లక్ష మంది వచ్చిన్రు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆదివారం, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో పిల్లాపాపలతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేశారు. సమ్మక్క, సారలమ్మ  దేవతలను దర్శించుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో దేవతల గద్దెల మీదికి ఎవరూ వెళ్లకుండా దేవాదాయ శాఖ, పోలీసులు గ్రిల్స్ గేట్లను మూసేశారు. గ్రిల్స్ బయటి నుంచే భక్తులు వనదేవతలకు పసుపు, కుంకుమ, పూలు, నైవేద్యం సమర్పించుకున్నారు. ఎత్తు బెల్లం పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

ట్రాఫిక్​ జామ్​

వేలాది వాహనాల్లో భక్తులు తరలిరావడంతో మేడారంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో రోడ్డు పక్కన నిలిపిన వాహనాలతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సుమారు లక్ష మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. సంక్రాంతి సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఏవో రాజేందర్ తెలిపారు. మేడారం పరిసర ప్రాంతాలైన చిలుకల గుట్ట, జంపన్న వాగు, చింతలు, ఊరట్టం, తాడ్వాయి రహదారిపై 5 కిలోమీటర్ల దూరం వరకు భక్తులు విడిది పెట్టుకొని విందు భోజనాలు చేశారు.