మేడారం పనుల్లో తప్పంతా ఆఫీసర్లదేనా?

మేడారం పనుల్లో  తప్పంతా ఆఫీసర్లదేనా?

సమీక్షలో మంత్రుల ఆగ్రహంపై అధికారుల ఆవేదన

రూ.180 కోట్లతో రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు

రెండు నెలల క్రితం రూ. 75 కోట్ల మంజూరు

అరకొర నిధులతో తక్కువ టైమ్‌‌లో పనులెట్ల చేయించాలె

సమీక్షలో మంత్రుల ఆగ్రహంపై అధికారుల ఆవేదన

జయశంకర్‌‌‌‌భూపాలపల్లి, వెలుగు: మేడారం మహాజాతర తేదీలు దగ్గర పడుతుండడం, పనులు ఇంకా పెండింగే ఉన్న  విషయంలో ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంపై అధికారులు ఆవేదన చెందుతున్నారు. తాము రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపితే ఇప్పుడు అరకొరగా నిధులిచ్చి ఇప్పుడు పనులు సరిగ్గా చేయడం లేదంటూ తప్పంతా తమపైనే నెట్టేస్తున్నారని వాపోతున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి మూడు రోజుల క్రితం మేడారం జాతర పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన సమీక్షలో నేషనల్‌‌‌‌హైవే, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ, పంచాయతీరాజ్‌‌‌‌శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరకు ఇంకా నెల రోజుల సమయమే ఉన్నప్పటికీ ఇంకా చాలా పనులు ఎందుకు పెండింగ్‌‌‌‌పెట్టారంటూ మండిపడ్డారు. అయితే వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే మేడారం మహా జాతర విషయంలో ప్రభుత్వ లోపాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనావేశారు. జాతరకు కనీసం 6 నెలల ముందు నిధులు విడుదల చేస్తే పనులు నాణ్యంగా చేయడానికి అధికారులకు సమయం ఉండేది. అలా చేయకుండా గతంలో మాదిరిగానే ఈ సారి కూడా జాతరకు కేవలం రెండు నెలల ముందు నవంబర్‌‌‌‌లో రూ.75 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ఉత్తర్వులిచ్చారు. దీంతో అధికారులు షార్ట్‌‌‌‌టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలే పనులు దక్కించుకున్నారు. నామినేషన్‌‌‌‌ పద్ధతిలో పనులు ఇవ్వకుండా, పనులను నాణ్యతగా చేయాలని జిల్లాస్థాయి మానిటరింగ్‌‌‌‌కమిటీ ఏర్పాటుచేసిన జిల్లా కలెక్టర్‌‌‌‌ నారాయణరెడ్డి ఆకస్మికంగా బదిలీ అయ్యారు.

రూ. 200 కోట్ల మంజూరుకు హామీ

2018లో మేడారం మహాజాతరకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన సీఎం కేసీఆర్‌‌‌‌ శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌‌ ‌‌ఆధ్వర్యంలో అప్పుడే రూ.180 కోట్లతో అన్ని ప్రభుత్వశాఖల వారీగా ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. ఆ ఫైల్‌‌‌‌ సీఎం పేషీలో  పెండింగ్‌‌‌‌ ఉంది. ఆ నిధులు విడుదల చేయకుండా రెండేళ్లు కాలం గడిపిన తర్వాత ఇప్పుడు హడావుడిగా రూ.75 కోట్లు మంజూరు చేశారు. అందులో రూ.30 కోట్లకు పైగా నిధులు జాతర మెయింటెనెన్స్‌‌‌‌పనుల కోసమే వెచ్చించాల్సి వస్తోంది. మిగిలిన నిధులతో శాశ్వత నిర్మాణాలు చేయించడం సాధ్యం కాలేదు. కొన్ని వర్క్‌‌‌‌లు చేపట్టినా సమయం తక్కువగా ఉండటంతో అధికారులు అవీ పూర్తి చేయలేకపోయారు.

పెండింగ్లో బిల్లులు

నేషనల్‌‌‌‌ హైవే, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ రోడ్ల పనుల వి షయంలో రూ. వందల కోట్ల బిల్లులు ప్రభుత్వం వద్దే పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా శాంక్షన్‌‌ ‌‌లేనిచోట రోడ్డు వర్క్‌‌‌‌లు చేయాలని నాయకులు ఆదేశించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పనులు చేయించలేకపోతే సస్పెండ్‌‌‌‌తప్పదని అందరి సమక్షంలో ఏకంగా మంత్రులే ఆదేశాలివ్వడం చూసి అధికారులు తీవ్ర ఒత్తడికి లోనైనట్లుగా కనిపించారు. చివరి నిమిషంలో అరకొరగా నిధులిచ్చి ఇప్పుడు తప్పంతా తమదే అన్నట్లుగా మాట్లాడుతున్నారంటూ వాపోతున్నారు.