పిల్లాజెల్లతో.. తల్లుల చెంతకు

 పిల్లాజెల్లతో.. తల్లుల చెంతకు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర వైపు ఊళ్లన్నీ కదిలిపోతున్నాయి. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుకోనుండడంతో మేడారం మహాజాతర అధికారికంగా మొదలుకానుంది. గురువారం రాత్రి శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య సమ్మక్క చిలుకలగుట్ట నుంచి మేడారంలోని గద్దెకు చేరుకోనుంది.

మూడు రోజుల పాటు జాతరలో పాల్గొని, తల్లులను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పిల్లాజెల్లతో కలిసి మేడారం బాట పట్టారు. బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలో భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మేడారంలో కనుచూపు మేరంతా భక్తుల గుడారాలతో నిండిపోయింది. - వెలుగు టీం, మేడారం