
- ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్‌ను పరిశీలించిన మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్
- పూజారుల సూచన మేరకు ఆధునీకరణ పనులు
- జాతరలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు
- జాతర ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క– సారక్క వన దేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా చర్యలు చేపడుతున్నామని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఇందుకోసం రూ.236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. బుధవారం సెక్రటేరియెట్‌లో దేవాదాయశాఖ మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మేడారం మాస్టర్ ప్లాన్‌పై మంత్రి సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది.
మంత్రులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్సెక్రటరీ శైలజా రామయ్యార్, ములుగు కలెక్టర్ దివాకర్ తోపాటు ఎండోమెంట్అధికారులు మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. అనుమతి తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని మంత్రులు తెలిపారు.
గద్దెల అభివృద్ధికి రూ.58.2 కోట్లు, గద్దెల వద్ద కళాకృతి పనులకు రూ.6.8 కోట్లు, జంపన్న వాగు అభివృద్ధి కోసం రూ.39 కోట్లు, భక్తుల వసతి కోసం రూ.50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ.52.5 కోట్లు, మిగతావి ఇతరత్రా ఖర్చుల నిమిత్తం వెచ్చించనున్నట్టు మంత్రులు చెప్పారు. మేడారం అభివృద్ధిలో పూజారులను భాగస్వాములను చేస్తామన్నారు. మహా జాతరకు ప్రజా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించిందని, అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు మంజూరు
చేస్తామని చెప్పారు.
ఒకే వరుస క్రమంలో గద్దెలు
కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు మాస్టర్ ప్లాన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టు మంత్రులకు అధికారులు తెలిపారు. సమ్మక్క – సారక్క పూజారుల సూచన మేరకు రూపొందించిన మేడారం ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్‌ను మంత్రులు పరిశీలించారు. డిజైన్లలో కొన్ని మార్పులపై మంత్రులు సూచించారు. మహా జాతరలోపు పూర్తి చేయాల్సిన పనులను త్వరగా చేపట్టాలని మంత్రులు సూచించారు. సమ్మక్క– సారక్క పూజారులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
భక్తుల సందర్శన కోసం అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. తగిన మేరకు డిజైన్లు మార్చాలన్నారు. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిద్వారా జాప్యం లేకుండా అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు.
జాతర విజయవంతం రహదారులపై ఆధారపడి ఉంటుందని.. అందుకే, మేడారం – ఊరట్టం, మేడారం – కన్నెపల్లితో పాటు మరో నాలుగు మార్గాల విస్తరణ పనులు చేపడుతున్నట్టు అధికారులు మంత్రులకు వివరించారు. అవసరమైతే నేషనల్ హైవే అధికారులతో మరోసారి రివ్యూ చేయాలని మంత్రులు నిర్ణయించారు. జాతర సమయంలో వెహికల్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. భక్తులకు ఫ్యూరిఫైడ్ వాటర్ అందించాలని సూచించారు.