మేడారంలో పనులు స్పీడప్..సర్కార్ మాస్టర్ ప్లాన్ అమలు

మేడారంలో పనులు స్పీడప్..సర్కార్ మాస్టర్ ప్లాన్ అమలు
  • గద్దెల వద్ద చెట్లు, వాచ్​టవర్ల తొలగింపు

ములుగు, తాడ్వాయి, వెలుగు : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు స్పీడందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్​ప్లాన్ అమలులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి  గత నెల 23న అమ్మవార్లను దర్శించుకొని పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. 

ఆదివాసీ సంప్రదాయాల మేరకు అమ్మవార్లకు గత నెల 30న పూజారులు ప్రత్యేక పూజలు చేసి భూమిపూజతో పనులకు అంకురార్పణ చేశారు. రెండు రోజలుగా పనులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ప్రాంగణంలోని చెట్లను తొలగిస్తున్నారు. కలెక్టర్​ దివాకర టీఎస్​ ప్రత్యేకంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.  ఇంజినీరింగ్​అధికారులు, మేడారం ఈవో, పూజారుల సమక్షంలో కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ సోమవారం ఆలయం చుట్టూ వాచ్​టవర్లను, పాత క్యూలైన్లను తొలగించారు. 

ఏండ్ల కింద నిర్మించిన మేడారం అమ్మవార్ల గద్దెల విస్తరణ, ఒకే లైన్ లో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేడారం మహాజాతర 2026, జనవరి 28 నుంచి 31వరకు జరగనున్న నేపథ్యంలో వంద రోజుల్లో పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.