తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ ప్రతిష్టలను, పవిత్రతను కాపాడుకోవడానికి ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని మనం వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు చౌలం శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మనం సొసైటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గ్రామపంచాయతీ సిబ్బంది ట్రైబల్ మ్యూజియం సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశుభ్రత, పచ్చదనమే నిజమైన సంపద అని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనాలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకూడదన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వ్యర్థాలను వేయాలని సూచించారు.
కార్యక్రమంలో మనం వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ సిద్దబోయిన లక్ష్మణరావు, నూతన మేడారం గ్రామ సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, ఉపసర్పంచ్ ఆలకుంట వనిత, వార్డ్ మెంబర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
