- మేడారం దారుల్లో జన సందోహం
- గద్దెలపైకి ఇయ్యాల (జనవరి 28) సారక్క, రేపు సమ్మక్క
- జంపన్నవాగు వద్ద ముగిసిన పూజలు
వరంగల్/ములుగు/తాడ్వాయి, వెలుగు: జనమంతా వనం బాట పట్టారు. వన దేవతలను కొలుచుకునేందుకు మేడారం బైలెళ్లారు. అక్కడికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎండ్ల బండ్లు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు.. ఇట్ల తీరొక్క బండ్లలో తరలివస్తున్న భక్తులతో దారులన్నీ సందడిగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో తొలిఘట్టం ఆవిష్కృతం కానున్నది. నాలుగు రోజుల ప్రధాన జాతర బుధవారంతో (జనవరి 28) షురూ కానుంది.
బుధవారం సాయంత్రం సమ్మక్క బిడ్డ సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దె పైకి చేరనున్నది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు కూడా గద్దెల మీదికి చేరగానే జాతర ప్రారంభమవుతుంది. సంప్రదాయ పూజల అనంతరం మంగళవారం పోనుగండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం వైపు బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ఆ తర్వాత గద్దెపై జంపన్నను కొలువుదీర్చారు.
రాత్రికి గద్దెపైకి సారక్క..
సారలమ్మ బుధవారం భక్తులు పట్టే వరం కొలుపుల మధ్య గద్దెపైకి చేరనున్నది. దీనికి ముందు వడ్డెలు (పూజరులు) జాతర నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆపై ప్రధాన పూజరి కాక సారయ్య వెదురుబుట్టలో (మొంటె) పసుపు, కుంకుమ భరిణితో కూడిన అమ్మవారి ప్రతిరూపంతో కాలినడకన భక్తుల జేజేల మధ్య మేడారానికి బయల్దేరుతారు. పిల్లలు కలగని మహిళలు సారక్కను వరాలతల్లిగా భావిస్తారు. ఈ క్రమంలో సారక్కను కన్నెపల్లి నుంచి మేడారానికి తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు రోడ్డుపై పడుకుని వరం పడుతారు.
జంపన్నవాగు మీదుగా వచ్చే క్రమంలో అక్కడ పూజలు నిర్వహించాకే వాగు దాటుతారు. అనంతరం పూజరుల బృందం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నాక.. సమ్మక్క, పగిడిద్దరాజుల పెండ్లి తంతు జరుగుతుంది. ఆపై సారలమ్మను జాతరలోని ప్రధాన గద్దెపై కొలువుదీరుస్తారు. బుధవారం మధ్యాహ్నం వరకు పగిడిద్దరాజు, గోవిందరాజు సైతం గద్దెల మీదకు చేరుకుంటారు. సారక్కతల్లి అదే రోజు రాత్రి 11 గంటల తర్వాత గద్దెను చేరుతుంది.
రేపు (జనవరి 29) చిలుకలగుట్ట నుంచి సమ్మక్క..
మేడారం జాతరలో కోట్లాది మంది భక్తజనం పులకరించే అపూర్వఘట్టం గురువారం సాయంత్రం సాక్షాత్కరించనున్నది. ప్రధాన గద్దెల నుంచి కిలోమీటరున్నర దూరంలో చిలకలగుట్ట నుంచి లక్షలాది మంది భక్తుల పూనకాల మధ్య కుంకుమ భరిణి రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజరులు జనంలోకి తీసుకొస్తారు. గుట్ట వద్ద ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సంకేతంగా గాలిలో 3 రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాక మొదలవుతుంది. ఐదారు గంటల పాటు ఈ మహాఘట్టం కొనసాగుతుంది. గురువారం అర్ధరాత్రి సమ్మక్క తల్లిని గద్దె మీదకు చేర్చుతారు.
బైలెల్లిన పగిడిద్దరాజు
మేడారం జాతరకు 60 కిలో మీటర్ల దూరంలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో కొలువుండే సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో పూజరులు శోభాయాత్రగా మంగళవారం మధ్యాహ్నం బయల్దేరారు. 10 కిలో మీటర్ల దూరంలో ఉండే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువైన గోవిందరాజు సైతం కాలినడకన మేడారానికి ప్రారంభమయ్యారు. ఇరువురు బుధవారం మధ్యాహ్నం తర్వాత ప్రధాన గద్దెలపైకి వస్తారు. మంగళవారం పోనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజరులతో కలిసి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు.
