మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..

మేడారం మహా జాతర తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు చేశారు ఆలయ పూజారులు. 

2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మహా జాతర  జరగనున్న ట్లు మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు బుధవారం (జులై 02) ప్రకటించారు. 28వ తేదీ (బుధవారం) సాయంత్రం 6 గంటలకు శ్రీ సారలమ్మ అమ్మవారు గద్దెకు వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత శ్రీ గోవింద రాజు, పగిడిద్ద రాజులు గద్దెలకు వచ్చే ఉత్సవాలను నిర్వహిస్తారు.

సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు గద్దెకు వచ్చిన తర్వాతి రోజు.. 29న ( గురువారం)  సాయంత్రం 6 గంటలకు  శ్రీ సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు. 30న భక్తులు తమ ఇష్ట దైవాలకు మొక్కుబడులు సమర్పించుకోవటం జరుగుతుంది.

చివరి రోజు 31న (శనివారం)  సాయంత్రం 6 గంటలకు తిరిగి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు,  గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేస్తారు. దీంతో ఈ మహా జాతర ముగుస్తుందని ఆలయ పూజారుల సంఘం ప్రకటించింది.