
- వచ్చే మహా జాతర లోపు భక్తులకు అందుబాటులోకి..
- మంత్రులు సీతక్క, సురేఖను సమ్మక్క, సారలమ్మలా భావిస్తా..
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సివిల్ సప్లై శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- మేడారం జాతర పనులపై మంత్రి సీతక్కతో కలిసి అధికారులతో సమీక్ష
తాడ్వాయి/వెంకటాపూర్, వెలుగు: వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పనులు 90 రోజుల్లో కంప్లీట్ చేసి, వందల ఏండ్లు చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సివిల్ సప్లై శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మహా జాతరలోపు ఆలయాన్ని భక్తుల దర్శనానికి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మాస్టర్ ప్లాన్ పనులను మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించారు. అనంతరం స్థానిక హరిత హోటల్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. గిరిజనులు పవిత్రంగా పూజించే వన దేవతలు సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని 300 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా శాశ్వతంగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రులు సీతక్క, కొండ సురేఖ కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి రెండు విడతల్లో రూ.211 కోట్ల నిధులను కేటాయించారని చెప్పారు.
మహా జాతరకు అందుబాటులోకి తెస్తాం
వచ్చే ఏడాది జనవరి చివరలో జరిగే మహా జాతరకు ముందే పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆలయ ప్రాంగణంలో రాతితో నిర్మాణాలను చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన రాయిని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జంపన్న వాగుకు ఇరువైపులా పదివేల మంది చొప్పున భక్తులు ఉండేందుకు వీలుగా షెట్టర్లు ఏర్పాటు చేస్తామని, పాత విధానానికి స్వస్తి పలికామని, ప్లాన్ మేరకు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులతో ఫౌండేషన్ పనుల టెక్నికల్ అంశాలపై చర్చించారు.
పనుల ఫురోగతిని సీతక్క పర్యవేక్షిస్తారన్నారు. గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముందస్తు మొక్కుల కు వచ్చే భక్తులు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. త్వరలో అధికారులతో పాటు మీడియాను కూడా విజిట్ కు తీసుకొస్తామన్నారు. తనపై అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రులు సీతక్క, సురేఖను సమ్మక్క, సారక్కలాగా భావిస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, డీఎస్పీ రవీందర్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఈవో వీరస్వామి, ఆర్కిటెక్ట్ అధికారులు, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అరేం లచ్చు పటేల్, పూజారులు, వివిధ అధికారులు, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.