- పనులు చేయించలేని ఆఫీసర్లు ఇంటికి వెళ్లిపోవచ్చు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ములుగు/తాడ్వాయి, వెలుగు : 'మేడారం అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ గద్దెల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు, పనులు చేయించలేని ఆఫీసర్లు ఇంటికి వెళ్లిపోవచ్చు, పనులు చేయని ఆఫీసర్లపై చర్యలు తప్పవు, క్వాలిటీలో రాజీ పడేది లేదు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మంత్రి సీతక్క, సీఎంవో పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరాజుతో కలిసి మేడారంలో పర్యటించారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.
అనంతరం గద్దెల పునఃనిర్మాణ పనులు, ఆలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, ప్రాంగణంలో ఫ్లోరింగ్, రాతి స్తంభాల నిర్మాణం, జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్ ద్ద జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి పనుల్లో ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పాలరాతి శిల్పాలను పరిశీలించి, పనులు సకాలంలో పూర్తవుతాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికే పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
పనుల్లో జాప్యం పట్ల ఆగ్రహం
మేడారంలో పనుల పరిశీలన అనంతరం పీఆర్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల ఆఫీసర్లతో స్థానిక హరిత హోటల్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సంద్భంగా పనులు జాప్యం అవుతుండడం పట్ల ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివాసీ, గిరిజనుల సంప్రదాయం ప్రకారం చేపడుతున్న పనుల్లో స్పీడ్ పెంచాలని, జనవరి మూడు లోపుగద్దెలకు ఓ రూపం తీసుకురావాలని ఆదేశించారు. అలాగే భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, జంపన్నవాగు వద్ద బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రధాన రహదారలు విస్తరణ పనులను వేగంగా చేయాలన్నారు.
నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించని ఆఫీసర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు, వారిని ఇంటికి పంపేందుకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్, డీఈ ధర్మేందర్, ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటరమణ, ఇరిగేషన్ డీఈ సదయ్య, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్, ఎండోమెంట్ ఈవో వీరస్వామి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి
పాల్గొన్నారు.

