నిధులు ఏమయ్యాయి...మంత్రి మల్లారెడ్డి ఇలాకలో బీఆర్ఎస్ సర్పంచ్ల నిలదీత

నిధులు ఏమయ్యాయి...మంత్రి మల్లారెడ్డి ఇలాకలో బీఆర్ఎస్ సర్పంచ్ల నిలదీత

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసరలో సర్వసభ్య సమావేశం రద్దు అయింది. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు సమావేశాన్ని అడ్డుకున్నారు. మంత్రి మల్లారెడ్డి అభివృద్ధి నిధుల నుంచి కీసర మండలానికి కోటి రూపాయలు ఇచ్చారని..ఇప్పటివరకు ఈ డబ్బులు గోధుమకుంట, కరీంగూడ గ్రామాలకు కేటాయించలేదని ఎంపీపీపై సర్పంచులు  మండిపడ్డారు. 

గెలిచి నాలుగు సంవత్సరాలు అవుతున్నా..మంత్రి మల్లారెడ్డి తమపై వివక్షత చూపుతున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం తాము ఎంత అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. అయినా సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ అధ్యక్షతన వహించాలి కానీ ఇక్కడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్ని తానై సమావేశాన్ని నడిపిస్తాడని ఆరోపించారు. సర్పంచుల నిరసనతో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ రద్దు చేశారు. 

మరోవైపు  మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తితో  కీసర మండలంలోని కొందరు ఎంపీటీసీలు  ఈ సమావేశానికి  హాజరవ్వలేదు. అయితే  కోరం లేకనే సర్వ సభ్య సమావేశాన్ని రద్దు చేసినట్లు ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ తెలిపారు.