మేధా స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి: ఏబీవీపీ ఆందోళన

మేధా స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి: ఏబీవీపీ ఆందోళన

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టౌన్ లోని మేధా హైస్కూల్ ను ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు, బాలుడి పేరెంట్స్ ముట్టడించి ఆందోళనకు దిగారు. స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... గత శనివారం మేధా హై స్కూల్ ఆవరణలోని ట్రాన్స్ ఫార్మర్ తగిలి 5వ తరగతి విద్యార్థి అర్మాన్ (9) తీవ్రంగా గాయపడ్డాడు. 

బాలుడు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఘటనపై స్కూల్ సిబ్బందిని అడిగితే.. స్కూల్ కు రావడం ఇష్టం లేక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని, కరెంట్ షాక్ తగిలినట్లు అబద్ధాలు చెబుతున్నారని బాలుడు పేరెంట్స్ ఆవేదన వ్యక్తంచేశారు. ఘటనపై ఏబీవీపీ నేతలు స్పందించారు. 

సోమవారం జిల్లా కన్వీనర్ మహేశ్​ఆధ్వర్యంలో కార్యకర్తలు బాధిత విద్యార్థి పేరెంట్స్ తో కలిసి స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్ మేనేజ్ మెంట్ కు ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేకనే ఘటన జరిగిందని మండిపడ్డారు. ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.