
హైదరాబాద్ , వెలుగు: కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం బాధాకరమని, ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం, వారి కుటుంబాలను ఒకే చోట చూడటం బాధగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం బేగంపేట టూరిజం ప్లాజాలో జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ చెక్కుల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం సీఎం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, అల్లం నారాయణ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ అండగా ఉంటుందని మంత్రి అన్నారు. అచ్చంపేటకు చెందిన జర్నలిస్టు చికిత్స కోసం, ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద రూ.40 లక్షలు ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనారోగ్యంతో జర్నలిస్టు కుటుంబాలకు హాస్పిటల్లో చికిత్స
పూర్తయిన తర్వాత సీఎంఆర్ఎఫ్ సాయం కావాలంటే ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి అకాడమీకి అందజేస్తే, తన పేషీ ద్వారా సీఎంకు సిఫార్సు చేస్తానన్నారు. ఎల్వోసీ రావడానికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాల కోసం అకాడమీ చేసిన గుర్తింపు కార్డును మంత్రి ఆవిష్కరించారు.