జలసౌధలో ఆంక్షలు!..మీడియాకు నో పర్మిషన్.. సిబ్బందికి ఐడీ ఉంటేనే ఎంట్రీ

జలసౌధలో ఆంక్షలు!..మీడియాకు నో పర్మిషన్.. సిబ్బందికి ఐడీ ఉంటేనే ఎంట్రీ
  •     ప్రధాన ద్వారం మాత్రమే ఓపెన్​.. అది కూడా ఒక్క తలుపే
  •     ఇద్దరు, ముగ్గురు భద్రతా సిబ్బందితో చెకింగ్స్​
  •     ఇరిగేషన్​ శాఖలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. నీటిపారుదల శాఖ సమాచారం లీక్​ అవుతోందన్న అనుమానాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆఫీస్​లోకి మీడియాను అనుమతించడం లేదు. ఉద్యోగులు తమ ఐడీ కార్డును చూపిస్తేగానీ లోపలికి పంపడం లేదు. జలసౌధ ప్రధాన ద్వారం వద్ద, లోపల లిఫ్టుల వద్ద గోడలపై ఆంక్షలకు సంబంధించిన పోస్టర్లనూ అంటించారు. 

బయటి వ్యక్తులు రిజిస్టర్​లో పేర్లను నమోదు చేసి వెళ్లాలని పేర్కొన్నారు. జర్నలిస్టులను మాత్రం అస్సలు అనుమతించడం లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

డోర్లన్నీ క్లోజ్..

జలసౌధలోకి వెళ్లే అన్ని డోర్లను క్లోజ్ చేయాలని ఈఎన్​సీ అడ్మిన్​ శ్రీనివాస్​ ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన ద్వారాన్ని కూడా ఒక తలుపును మూసి.. ఒక్క రెక్కను మాత్రమే తెరిచి ఉంచాలని హుకూం జారీ చేశారు. ఇద్దరు, ముగ్గురు భద్రతా సిబ్బందిని పెట్టి సీనియర్​ అధికారులతో పాటు సిబ్బంది ఐడీ కార్డులను చెక్​ చేసి పంపిస్తున్నారు. ఐడీ లేదంటే ఆపేస్తున్నారు. సీనియర్​అధికారులనూ ఐడీ కార్డులు అడగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మీడియా ప్రతినిధులను డోర్​ వద్దే ఆపేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్లాలో స్లిప్పు రాసి.. సదరు అధికారికి పంపుతామని, అక్కడి నుంచి పర్మిషన్​ వస్తేనే వెళ్లాలని చెప్తున్నారు. 

కానీ, లోపలి నుంచి ఎంత సేపటికీ పర్మిషన్​ రాకపోడంతో మీడియా ప్రతినిధులు వెనుదిరుగుతున్నారు. అంతేకాదు, మీడియా ప్రతినిధులు ఎవరొస్తున్నారు? ఎవరి దగ్గరకు వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? వంటి సమాచారమంతటినీ జలసౌధ సిబ్బంది రికార్డు చేస్తున్నారు. దీంతో అధికారుల నిర్వాకం వల్ల అసలు ఇరిగేషన్​శాఖలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది.